ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కలకలం రేగింది. కొందరు వ్యక్తులు చంద్రబాబును అవమానించేలా వ్యవహరించారు. కుప్పంలో చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. గత నెలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. ఐతే బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఫ్లెక్సీలకు నిప్పంటించారు. ఈ ఘటనపై స్పందించిన టిడిపి నాయకులు,కార్యకర్తలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులకి ఫిర్యాదు చేశారు. సమీపంలోని సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కుప్పంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి షాకిచ్చారు. కుప్పం నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. మొత్తం 89 పంచాయతీలకు కూడా 75 పంచాయతీల్లో ఘన విజయం సాధించింది. కేవలం 14 పంచాయతీలు మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. బాబు సొంత గ్రామ పంచాయతీ అయిన కందులవారి పల్లెలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి గెలవడంతో కాస్త పరువు దక్కింది. ఓట్ల పరంగా కూడా దాదాపు 30వేల ఓట్లు మెజారిటీ సాధించినట్లు అప్పట్లో వైసీపీ ప్రకటించింది.
ఇక పంచాయతీ ఎన్నికల ముగిసిన తర్వాత కుప్పంలో పర్యటిచింన చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. కుప్పం అభివృద్ధిని మరిచారని.. అలాగే కరోనా టైమ్ లో తమ బాగోగులు చూడలేదంటూ చంద్రబాబుపై మండిపడింది. దీంతో బాబు పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఫ్లెక్సీలు దగ్ధం చేయడంతో మరోసారి కుప్పం రాజకీయం వేడెక్కింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu