YCP Leaders: అధికార పార్టీకి రోజు రోజుకూ తలనొప్పులు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన జిల్లాల్లోనూ.. ఇప్పుడు వైసీపీ (YCP) కి తిప్పలు తప్పడం లేదా..? అది కూడా కేవలం ముగ్గురు నేతల తీరు కలవర పెడుతోంది. ప్రస్తుతం ఆ జిల్లాలో అదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆ ముగ్గురు నాయకుల చుట్టూనే ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) వైసీపీలో చర్చ జరుగుతోంది. వారెవరంటే..? రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja).. ఇంకొకరు ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantababu) .. మూడో వ్యక్తి మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి (Minster Pinepi Viswaroop son Krishnareedy). ఈ ముగ్గురు వ్యవహార శైలి.. పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక నేత ప్రభుత్వ ఉద్యోగిపై చెయ్యి చేసుకుంటుంటే.. మరో నేత ఏకంగా హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక మంత్రి తనయుడు సొంత పార్టీ నేతలపైనే ఫోన్‌లో బూతు పురాణం అందుకున్నారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో పూర్తిగా మద్దతు ఇచ్చిన సామాజిక వర్గానికి చెందిన.. మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు తీరు అధికారపార్టీని ఇబ్బందులోకి నెట్టింది అంటున్నారు. ఆ హత్యా నేరాన్ని ఆయన ఒప్పుకున్నారనే ప్రచారం ఉంది. అందుకే ప్రస్తుతం అనంతబాబు అరెస్ట్ కాగానే.. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. ఈ సమస్యను విపక్షాలు రాజకీయ అస్త్రంగా మార్చడం.. స్థానిక ప్రజల్లోకి బాగానే వెళ్లింది. దీంతో ఆ వర్గం ఓట్లకు జిల్లాలో గండిపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇకఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎపిసోడ్ సైతం ఇప్పుడు దుమారం రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఇరిగేషన్ ఏఈఈ సూర్య కిరణ్ చెంప చెల్లుమనిపించారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. దీంతో బాధిత అధికారి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేగింది. చివరకు పార్టీ పెద్దల ఆదేశాలతో… అర్ధరాత్రి బాధిత అధికారితో ఎమ్మెల్యే రాజీ చేసుకోక తప్పలేదు. గతంలోనూ ఎమ్మెల్యే రాజాపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వాటిని గుర్తు చేస్తూ మరోసారి రాజా తీరును చర్చల్లో పెట్టాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగుల్లో చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజా వ్యవహారం పెను దుమారం రేపుతోంది.
ఇదీ చదవండి : వెదురు అలంకరణకే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..? తెలిస్తే అస్సలు వదలరు..
తాజాగా అమలాపురం అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు ఆందోళనకారులు. ఆ ఘటనపై ఒకవైపు పోలీసు విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇదే సమయంలో మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఫోన్‌లో వైసీపీకే చెందిన ఎంపీటీసీ సత్తిబాబును బూతులు తిట్టడం దుమారం రేపింది. ఈ ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ వర్గాలు ఇరకాటంలో పడ్డాయి. ఎంపీటీసీని చంపేస్తాననే విధంగా మంత్రి తనయుడు బెదిరించారని అధికారపార్టీ వర్గాలే విస్మయం చెందాయి.
ఇదీ చదవండి : నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో వల్లభనేని వంశీ, కొడాలి నాని? మ్యాటర్ ఏంటంటే..?
ఇలా ముగ్గురు నేతల తీరు జిల్లా మొత్తం ప్రభావం చూపిస్తుందని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారనే ప్రచారం ఉంది. ఇప్పటికే భారీగా డ్యామేజ్ జరిగిందని.. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే.. జిల్లాలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే జిల్లాలో ప్రధాన సామాజిక వర్గం జనసేన వైపు మొగ్గు చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, East Godavari Dist, Ysrcp