Will MPs Turned MLAs: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఏ క్షణమైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నది చాలామంది అభిప్రాయం. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మాత్రం.. ఎన్నికలు 16 నెలల్లోనే ఉంటాయని చెబుతున్నారు తప్పా.. ఎప్పుడు అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. విపక్షాలు మాత్రం ఏడాది లోపే ఎన్నికలు ఉండొచ్చు అంటున్నాయి. కొందరు వైసీపీ నేతలు (YCP Leaders) సైతం ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచి 2024 ప్రణాళికలను మొదలెట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా (Visakha District) లో ఎంపీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ఎంపీలు చాలా పవర్ ఫుల్ అనే ముద్ర ఉండేది. సుదీర్ఘ అనుభవం, విస్త్రతమైన పరిచయాలతో ఓ వెలుగు వెలిగినవారే ఇక్కడ ఎంపీలు అంతా. సీనియారిటీ, సంప్రదాయంగా సీట్లు కేటాయించే విధానానికి తొలిసారి బ్రేకులు వేసింది వైసీపీ. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది. అంతేకాదు వారందరినీ గెలిపించుకుంది వైసీపీ. విశాఖ ఎంపీ (Visakha MP) గా ప్రముఖ బిల్డర్ MVV సత్యనారాయణ (MVV Satyanarayana), ఎస్.టి. రిజర్వ్డ్ నియోజకవర్గం అరకు నుంచి గోడ్డేటి మాధవి (Goddeti Madhavi).. అనకాపల్లి నుంచి డాక్టర్ సత్యవతమ్మ (Satyavatamma) గెలిచారు. ఈ ముగ్గురు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు మూడున్నరేళ్లుగా చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి.
అయితే మొదట్లో విశాఖ ఎంపీ ఎంవీవీకి అన్నీ అనుకూలంగానే కనిపించాయి. కానీ అనూహ్యంగా అంతర్గత సమీకరణాలు మారాయి. ముఖ్య నాయకుడితోనే ఆయన వైరం పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.అందుకే ప్రస్తుతం తన వ్యాపార సంబంధమైన ప్రాజెక్టులపై తలెత్తిన విమర్శలను పరిష్కరించుకుని పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారు ఎంపీ.. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని అసెంబ్లీ బరిలోకి దించేందుకు వైసీపీ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే చర్చ బలంగా ఉంది.
విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన వెలగపూడికి అడ్డుకట్ట వేయడానికి ఎంవీవీనే బలమైన అభ్యర్ధిగా హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మొదట్లో ఎంపీ అంతగా సుముఖత వ్యక్తం చేయనప్పటికీ.. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రమోషన్ వస్తుందనే ఆలోచనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఇక టీచర్‌గా కెరీర్ ప్రారంభించి అనూహ్యంగా ఎంపీ అయ్యారు గొడ్డేటి మాధవి. ఆమె తండ్రి దేవుడు చింతపల్లి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ నీడ ఎప్పుడు ఆమె మీద పడలేదు. తొలి ప్రయత్నంలోనే కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ పై భారీ మెజారిటీతో మాధవి గెలిచారు.
ఇదీ చదవండి : ముగిసిన బీసీ కార్పోరేషన్ల పదవీకాలం.. ఈ రెండేళ్లలో వాటిద్వారా ఒనగూరిన లబ్ధి ఎంత..?
అలాగే అరకు పార్లమెంట్ పరిధిలోనే పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాల్లో కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ గెలిచారు. మొదట్లో వీరంతా సఖ్యంగానే కనిపించినప్పటికీ తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. స్థానిక ఎమ్మెల్యేలతో మాధవికి వర్గ విభేదాలు మొదలయ్యాయి. దీనివెనుక బలమైన కారణాల్లో ఒకటి.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటుపై మాధవి కన్నేయడమనే ప్రచారం ఉంది. అంతేకాదు సొంత నియోజకవర్గమైన పాడేరు నుంచి ఆమె పోటీకి ఆసక్తిని కనబరుస్తున్నట్టు టాక్. ఆ దిశగా తన వర్గాన్ని యాక్టివేట్ చేసి పనిలో ఉన్నారట. దీంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అలర్ట్ అయ్యాని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి : జనసేనలో చేరుందుకు డేట్ ఫిక్స్ అయ్యిందా? కన్నా లెక్కలు ఏంటి? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?
ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టడంతో అసంతృప్తులు కాస్త చల్లబడ్డాయి. ఎమ్మెల్యే నుంచి ఎదురుదాడి పెరగడంతో మాధవి పునరాలోచనలో పడ్డారట. ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక నెరవేర్చుకోవడానికి అరకుపై ఫోకస్ పెట్టారట. ఇక్కడ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణది వాల్మీకి సామాజికవర్గం. కానీ.. అరకులో కొండదొర సామాజికవర్గం బలం ఎక్కువ. పైగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఆదివాసీ హక్కుల పరిరక్షణకు మాధవి తండ్రి దేవుడు పనిచేశారు. వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాల మద్దతు కూడగట్ట గలిగితే తన గెలుపు ఈజీ అవుతుందనే అంచనాల్లో మాధవి ఉన్నారట. ఎంపీ వ్యూహాలను పసిగట్టిన ఎమ్మెల్యే ఫాల్గుణ.. విరుగుడు మంత్రాలు జోరుగానే వేస్తున్నారని భోగట్టా.
ఇక అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ భీశెట్టి సత్యవతి అనూహ్యంగా వైసీపీలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా వెళ్లాలని ఆశపడ్డా.. పార్టీ నిర్ణయం మేరకు ఎంపీగా గెలిచారు. మంత్రి అమర్నాధ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వర్గాలకు దీటుగా రాజకీయం చేయాలని చూశారు. ఆ తర్వాత కాలంలో మంత్రి, ఎంపీ సయోధ్యకు వచ్చినట్టు కనిపించినా.. దాడి వెర్సస్ ఎంపీ కుంపటి రాజుకుంటూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి కాకుండా యలమంచిలి నుంచి పోటీ చేయాలని అమర్నాథ్ చూస్తున్నారట. దాంతో అనకాపల్లి అసెంబ్లీ సీటుపై ఎంపీ సత్యవతి ఫోకస్ చేసినట్టు టాక్. గవర సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే డిమాండ్‌కు అనుగుణంగా అనకాపల్లి సీటు కోసం గట్టిగా ప్రయత్నించాలని సత్యవతమ్మ భావిస్తున్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Visakhapatnam