Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం లో అధికార వైసీపీ (YSRCP) లో అసమ్మతి రాగం రోజు రోజుకు తీవ్రమవుతోంది. గత ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్న వైసీపీ అధికారం చేపట్టిన తొలినాళ్ళలో ఆపార్టీ అధినేత, సీఎం జగన్ (AP CM YS Jagan) కు అడ్డుచెప్పేవాళ్లే లేరు. ఐతే రోజులు గడుస్తున్నకొద్ది ప్రభుత్వం పట్ల ప్రజలలో నమ్మకం సడలిపోతుందని సి-ఓటర్, ఐ-ప్యాక్ ( I PAC) వంటి ప్రైవేటు సర్వే సంస్థలే గాక ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లా పని చేసే ఇంటిలిజెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవన్నీ కేవలం ప్రచారం మాత్రమేనని అధికార పార్టీ నేతలు కొట్టిపారేసిన తర్వాత సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి.
అధికారం చేపట్టిన తొలినాళ్ళలో అధినేత తో నియోజకవర్గం సమస్యలపై మాట్లాడటానికి కూడా భయపడే శాసనసభ్యులు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తుంటే.. గతంలో ప్రతిపక్షాలపై ఒంటికాలిపై పడిన మరికొందరు నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఆనం, కోటంరెడ్డి ఎపిసోడ్ లతో ఆ పార్టీలో లుకలుకలు తారాస్థాయిలో బయటపడ్డాయి.
గతంలో మంత్రివర్గ విస్థరణ సమయంలో జగన్ కి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ మేకతోటి సుచరిత , బాలినేని శ్రీనివాసరెడ్డి , పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వంటివారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పైగా తాడేపల్లిలో జగన్ సతీమణి భారతి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల హవాపై ఆ పార్టీ నేతలు లోలోపల రగిలిపోతున్నారనే ప్రచారమూ లేకపోలేదు.
అధికారం చేపట్టిన తొలినాళ్ళలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అన్నివర్గాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. దీనికి తోడు ఆర్దిక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాని దుస్థితి ఏర్పడిందంటున్నారు విశ్లేషకులు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక, పంచాయితీ ఖాతాలలో నిధులు లేకపోవడంతో స్థానిక సంస్ధల ప్రతినిథుల నుండి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇందులో ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి నాయకులే ఉన్నారు.
ఓ వైపు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి రాగం వినిపిస్తుంటే.. మరోవైపు ఆర్ధిక కష్టాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న నివేదికలు వైసీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపబాలు బలపడుతుండటం కూడా అధికార పార్టీని టెన్షన్ పెడుతోంది. ఇదిలా ఉంటే వ్యతిరేకత తీవ్రం కాకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్తే గట్టెక్కగలమని సీఎం జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం సెట్ చేసుకున్న 175/175 టార్గెట్ కలలో కూడా సాధ్యం కాదని.. అధికారాన్ని కాపాడుకుంటే అదే పదివేలు అనేలా పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp