AP POLITICS TENSION IN NEW MINSTER CM JAGAN PLAN TO CUT THEIR POWERS FOR EX MINSTERS PROMISE NGS
AP Minsters: వారి కోసం.. కొత్తమంత్రుల అధికారాలకు కోత పడుతుందా..! పదవిలో ఉన్న వారు డమ్మీలేనా?
ప్రతీకాత్మకచిత్రం
AP Minsters: ఎన్నో ఆశలతో కొత్తగా మంత్రి పదవులు తీసుకున్న వారికి షాక్ తప్పదా..? వారి అధికారాలకు కొతే పడే అవకాశం ఉందా..? మాజీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ.. కొత్త మంత్రులను డమ్మీలుగా చేస్తుందా..? ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
AP Minsters: సీఎం జగన్ (CM Jagan) ఏ ముహూర్తాన కేబినెట్ విస్తరించారో (Cabinet Reshffule).. అప్పటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అధికార పార్టీలో అసమ్మతి రాగం వినిపించింది. మాజీలైన కొందరు పార్టీలు మారుతున్నారని.. రాజీనామాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అధినేతతో చర్చల తరువాత వాతావరణం చల్లబడినట్టు కనిపించినా.. అంతా నివురుకప్పిన నిప్పులా ఉందనే ప్రచారం ఉంది. మరో ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. మాజీల కోసం కొత్త మంత్రుల (New Minsters) అధికారాలకు కోత తప్పేలా లేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని.. ఎందరో దేవుళ్లకు మొక్కుకొని అధినేత అనుగ్రహం పొంది మంత్రులు అయినవారందరికీ ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.. ఇప్పటికే కొందరు బాధ్యతలు కూడా స్వీకరించగా.. మరికొందరు బాధ్యతలు స్వీకరించే పనిలో ఉన్నారు. రాబోయే రెండేళ్ల పాటు.. తమ తమ జిల్లాలో అంతా తామే అనే ఆశల్లో తేలిపోతున్నారు. శాసించే స్థానంలో ఉన్న మంత్రులు శాసించే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ తొలి కేబినెట్ లో మొత్తం 25 మంది ఉంటే.. వారంతా తమ చివరి కేబినెట్ లో మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అయితే తరువాత అనేక సమీకరణల తరువాత.. ఇద్దర్ని ముగ్గుర్ని మాత్రమే కొనసాగిస్తానని చెప్పిన అధినేత..తరువాత మారిన లెక్క కారణంగా 11 మందిని కొనసాగించాల్సి వచ్చింది. దీంతో 14 మంది మాజీ మంత్రులుగా మిగిలిపోయారు. అయితే వారికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడంతో పాటు కేబినెట్ ర్యాంక్ పదవులిచ్చి.. వారి హోదా తగ్గకుండా చూస్తామని.. జగన్ హామీ ఇచ్చారని.. పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పుడు.. ఆ పని మీదే వైసీపీ అధిష్టానం ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉన్న 26 జిల్లాలకు సంబంధించి.. కొత్తగా 26 జిల్లా అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తారనే సమాచారముంది. వీటికి ఛైర్మన్లుగా.. మాజీ మంత్రులతో పాటు మంత్రి పదవులు ఆశించి భంగపడిన వాళ్లతో భర్తీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు జిల్లా ప్రణాళికా కమిటీలు, జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీలు ఉండేవి. వాటి వ్యవహారాలను.. జిల్లా ఇంచార్జి మంత్రులే చూసుకునేవారు. జిల్లాలో ఏ అభివృద్ధి పని జరగాలన్నా.. ఇంచార్జ్ మంత్రుల సంతకం ఉండాల్సిందే.. ఈ పదవే మంత్రులకు కిక్కు ఇచ్చేది. మొన్నటిదాకా ఉన్న ఇంచార్జ్ మంత్రులంతా.. ఈ పవర్ ఫుల్ రోల్ ప్లే చేసేవారు. ఇప్పుడీ ఇంచార్జ్ మంత్రుల వ్యవస్థను రద్దు చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో పాటు.. ప్రణాళికా కమిటీలు, అభివృద్ధి సమీక్షా కమిటీల స్థానంలో.. అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసి.. వాటికి మాజీ మంత్రులు, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లను నియమించి.. వారికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని చర్చ సాగుతోంది.
కొత్త పదవుల సృష్టి బాగానే ఉన్నా.. దీని వల్ల అధికారాలన్నీ.. కొత్త వ్యవస్థకు పోతే.. కొత్తగా వచ్చిన మంత్రులంతా డమ్మీలవుతారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మినిస్టర్ పోస్టులో ఉండి పవర్ లేకపోతే లాభమేంటనే టాక్ వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వారికి-వీరికి.. అధికారాలను బ్యాలెన్స్ చేస్తూ అంతా కలిసుండేలా.. ఒకే వేదికగా దీనిని తీసుకురాబోతున్నారని మరో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి అభివృద్ధి మండలి గనక ఏర్పాటు చేస్తే.. వాటి ఛైర్మన్లుగా మాజీ మంత్రులను నియమిస్తే.. వాళ్లు కొత్త మంత్రులను కాదని దూసుకెళ్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయ్. అప్పుడు.. జిల్లాలో రెండు అధికార కేంద్రాలు ఏర్పాటయ్యే ప్రమాదం లేకపోలేదు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.