ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. పల్నాడు(Palnadu)లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అవినీతి ఆరోపణలు, వందల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారంటూ పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో పల్నాడు జిల్లాలోని నరసరావుపేట (Narasa Raopet)నియోజకవర్గంలో టీడీపీ(TDP), వైసీపీ (YCP)నేతల మధ్య అవినీతిపై చర్చకు రమ్మని సవాల్ చేసుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఈపరిస్ధితుల నేపథ్యంలోనే నరసరావుపేట టీడీపి ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు(Arvind Babu)ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్పీ పర్మిషన్ తీసుకున్నప్పటికి పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారంటే ..స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (Gopireddy Srinivas Reddy)తన తప్పులను అంగీకరించినట్లేనని చదలవాడ అరవింద్‌బాబు విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అటు వైసీపీ వర్గీయుల్లో ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో నరసరావుపేటలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు టీడీపీ నేతను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసారు.
పల్నాడులో మళ్లీ టెన్షన్ టెన్షన్..
ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న పల్నాడు జిల్లాలో ఇప్పుడు రాజకీయ సవాళ్లు ప్రతిసవాళ్లతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా కోడెల హయాంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి చదలవాడ అరవింద్‌బాబు వైసీపీ నేతలే కోట్ల రూపాయల అవినీకి పాల్పడ్డారని విమర్శించారు. దమ్ముంటే తాము చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని కోటప్పకొండకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీనిపై అటు వైసీపీ వర్గాలు సైతం ప్రతి సవాల్ విసిరింది. గత కొద్దిరోజులుగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ జరుగుతోంది. అది కాస్తా అవినీతి పేరుతో తారాస్థాయికి చేరుకుంది.
బహిరంగ చర్చకు సవాల్..
ఎమ్మెల్యే గోపిరెడ్డి పై అవినీతి ఆరోపణలు నిరుపించేందుకు ఉగాది రోజున కోటప్పకొండపై బహిరంగచర్చకు వెళ్లేందుకు సిద్దమైన అరవింద్ బాబును అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై అరవింద్‌బాబు పోలీసులు అనుమతి పేరుతో అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. జిల్లా SPని ఈ కార్యక్రమం గురించి ముందుగా అనుమతి కోరామన్నారు. అయినప్పటికి పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన తప్పులను ఒప్పుకున్నట్లేనని ఆరోపించారు అరవింద్ బాబు. గోపిరెడ్డి అవినీతిపై దేవుని ఎదుట ప్రమాణం చేయటానికి తాను సిద్దంగా ఉన్నానని ..అవినీతి ,అక్రమ,అసత్య , రాజకీయాలు చేయటంలో గోపిరెడ్డి దిట్ట అని..గోపిరెడ్డి ప్రతి అడుగులో అవినీతి ఉందన్నారు అరవింద్‌బాబు. ఆయన చేసే ప్రతి అవినీతికీ మావద్ద సాక్ష్యం ఉందని మరోసారి ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై చర్చ..
ఇసుక, రేషన్ బియ్యం, గుట్కా, మట్కా, గంజాయి, ల్యాండ్ మాఫియా ప్రతి దాంట్లో ఎమ్మెల్యే హస్తం ఉందన్నారు. దోచుకో,దాచుకో అనే కోణంలోనే నరసరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి పాలన సాగుతుందని ఘాటు విమర్శలు చేశారు అరవింద్ బాబు. అయితీ ఈ ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ చాలా రోజులుగా నడుస్తోంది. అయితే రీసెంట్‌గా కోడెల విగ్రహావిష్కరణ కార్యక్రమం, నియోజకవర్గంలో అరవింద్‌బాబు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నాలక్ష్మీనారయణతో నియోజకవర్గంలో గ్రిప్ తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామమైన బుచ్చిపాపన్నపాలెం, అరేపల్లి గ్రామాల్లో సైతం పర్యటించారు. అక్కడి ప్రజలకు వైసీపీ పాలనకు గుడ్ బై చెప్పాలని..ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ది జరగలేదని..చేసిన పనులన్నీ టీడీపీ హయాంలో జరిగినవేనంటూ ప్రచారం చేస్తూ వచ్చారు అరవింద్‌బాబు.ఈ పరిస్థితుల్లోనే మళ్లీ అవినీతిపై బహిరంగ చర్చకు ఇరు పార్టీల నేతలు సవాల్ చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Gunturu, Politics, TDP, Ycp