ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా..అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలోని ఏడవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉషారాణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చిన నాగేశ్వరరావును జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారని ఉషారాణి ఆరోపించారు. మరోవైపు అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా అడ్డుకున్నామని.. ఆతర్వాత మాటామాట పెరిగిందని జనసేన నేతలంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. పోలింగ్ కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లా ప్రోద్దుటూరు పట్టణం 5వ వార్డులోని అరవిందాశ్రమం పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ కార్యకర్త ప్రచారం చేస్తుండగా టీడీపీ నేతలు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అలాగే మైదుకూరులోని 10వ వార్డు టీడీపీ జనరల్ ఏజెంటుగా ఉన్నముత్తూరు వెంకట సుబ్బారెడ్డిని పోలింగ్ బూత్ వద్ద డీఎస్పీ అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఇది చదవండి: పోలింగ్ కేంద్రంలో పవర్ స్టార్...జనసేనాని ఓటు వేసింది ఇక్కడే..
కడప జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికై వైఎస్ఆర్సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాగం జరిగింది. ప్రొద్దటూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతల మధ్య క్యూలెన్లు, ఏజెంట్ల విషయంలో వాగ్వాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రొద్దటూరులోని పరిస్థితుల దృష్ట్యా 12వ వార్డులో వైసీపీ-టీడీపీ అభ్యర్థులను పోలీసులసు గృహనిర్బంధం చేశారు. ప్రొద్దుటూరు 32 వార్డు టీడీపీ అభ్యర్ధి సీతారామిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటిలోని 34వ వార్డులో వైసీపీ అభ్యర్థి మణిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించిన పోలీసులు.. టీడీపీ అభ్యర్థిని అనుమతించకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందళనకు దిగారు. తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, Janasena party, TDP, Ysrcp