ఏపీలో రాజకీయాలు మారుతున్న వేళ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలు తమ సొంతం కావాలని వైసీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం జగన్ (YS Jagan) మంత్రులకు స్పష్టం చేశారు. ఒక్కో మంత్రికి పలువురు ఎమ్మెల్యేలను కేటాయించి.. వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేంతవరకు సమన్వయం చేసుకోవాలని వారికి సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏపీలో రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే తమకు హ్యాండ్ ఇస్తారనే దానిపై వైసీపీ నాయకత్వం, మంత్రుల్లో కలవరం నెలకొంది. టీడీపీ(TDP) తమ పార్టీ తరపున ఈ ఎన్నికల్లో పంచమర్తి అనురాధను బరిలోకి దింపింది. ఆమె గెలుపు కోసం 23 ఎమ్మెల్యేలు అవసరం.
అయితే ప్రస్తుతం టీడీపీకి 19 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉండటంతో.. టీడీపీ సంఖ్యాబలం తగ్గిపోయింది. అయితే వైసీపీలో కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లు టీడీపీ వైపు అనుకూలంగా వ్యవహరించే ఉంది. వాళ్లు కాకుండా వైసీపీలో ఇంకా ఎవరైనా అసంతృప్తి నేతలు టీడీపీకి అనకూలంగా వ్యవహరిస్తే పరిస్థితి ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది.
ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని చాటి చెప్పేందుకు ఈ ఎన్నికలకు టీడీపీ అవకాశంగా మలుచుకునే అవకాశం ఉందని వైసీపీ నాయకత్వం అనుమానిస్తోంది. అందుకే ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పలువురు ఎమ్మెల్యేలను కొందరు మంత్రులకు అప్పగించి.. వారికి సమన్వయ బాధ్యతలను అప్పగించనుంది. మంత్రులకు అప్పగించిన ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినా.. ఆ ప్రభావం మంత్రులపై పడే అవకాశం ఉంది. ఇదే అంశంపై కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
Ap: అసెంబ్లీ వేదికగా ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్
దీంతో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రులకు పెద్ద సవాల్‌గా మారబోతున్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు బహిరంగంగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆనం రామనారాయణరెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా.. ఆ స్థాయిలో పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారా ? అనే అంశంపై వైసీపీ ప్రభుత్వం, మంత్రులు సీరియస్‌గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. చివరి నిమిషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే.. అది తమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైసీపీ భావిస్తోంది. అందుకే ఈ విషయంలో వైసీపీ చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.