Chandrababu letter to PM: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విధానాలపై పోరాటం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). ప్రజా వ్యతిరక పనులపై ఇప్పటికే జిల్లాల పర్యటనల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన పోరాటంలో మరో అడుగు ముందుకు వేశారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణంలో జరుగుతున్న జాప్యం.. నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జలశక్తి మంత్రికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో స్పష్టంగా ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి సహకరించాలి.. పోలవరం పై కేంద్రం, PPA రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని లేఖలో ఆరోపించారు. తక్షణం చర్యలు తీసుకోవాల్సింది అంటూ ఆయన కోరారు.
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదాతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది. 2014లో కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఎపికి బదిలీ చేయడం ప్రాజెక్టుకు మేలు జరిగిందని గుర్తు చేశారు. అలాగే నీతి-అయోగ్ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అద్భుతమైన పురోగతిని నమోదు చేయడంలో ఎంతో సహాయపడిందని కొనియాడారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి అని.. నదుల అనుసంధానానికి ఆధారమన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని టీడీపీ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 71 శాతం పూర్తి చేసిందన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేవలం ఉద్దేశ్య పూర్వక, అసమర్థ నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. వారి అసమర్ధత కారణంగా అడుగులు ముందుకు పడడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అందుకే వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు తలచుకుంటే నాకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేతృత్వంలోని అధికారం చేపట్టిన నాటి నుంచి స్వార్థ ప్రయోజనాలతో ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రాధాన్యతలతో ముందుకెళుతోందని లేఖలో తెలిపారు. అయితే ఈ విషయాలు కేంద్రానికి తెలిసినా.. చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం అంటూ లేఖలో ప్రశ్నించారు చంద్రబాబు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Central governmennt, Chandrababu Naidu, Polavaram