AP POLITICS TELUGU DESAM DARSHI LEADERS GO SLOW AFTER MAHANADU SUCCESS WHAT HAPPENED NGS
Telugu Desam Party: ఆ నియోజకవర్గం టీడీపీలో గందరగోళం.. మహనాడు తరువాత స్పీడ్ కు బ్రేక్ లు.. దుబాయ్ పేరుతో రచ్చ?
చంద్రబాబు (ఫైల్)
Telugu Desam Party: ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికలు డూ ఆర్ డై లాంటివి.. గెలవకపోతే నాయకుల భవిష్యత్తు గందరగోళంగా మారుతుంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో గెలుపు కీలకమే. అయితే ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మొన్నటి వరకు తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ లో కనిపిస్తూ.. జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లారు.. కానీ దుబాయ్ పేరు తెరపైకి రావడంతో.. వారు సైలెంట్ అయ్యారు.. ఇంతకీ ఏమైంది..?
Telugu Desam Party: ఆంధ్రప్రదేశ్ ‘(Andhra Pradesh) లో అధికార వైసీపీకి తిరుగులేదని చెప్పొచ్చు.. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).. తరువాత జరిగిన స్థానిక ఎన్నికల్లో చాలా జిల్లాల్లో అడ్రస్ గల్లంతైంది. అందులోనూ టీడీపీ కి కంచుకోట అనుకునే నియోజకవర్గాల్లోనూ ఓటమి తప్పలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సొంత నియోజకవర్గం.. ఆ పార్టీకి కంచుకోట అనుకున కుప్పం (Kuppam)లో సైతం మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ సొంతం చేసుకుంది. కానీ ఇంత గాలిలోనూ.. ఆ నియోజవకర్గంలో మాత్రం టీడీపీ గెలిచి రికార్డు సృష్టించింది. అధినేత కూడా అన్ని వేదికలపైనా ఆ గెలుపు గురించే మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా దుబాయ్ గోల వచ్చిపడింది. దీంతో జెట్ స్పీడులో దూసుకుపోతున్న పార్టీ కాస్తా ఇప్పుడు సైలెంటైంది. దీంతో తమ్ముళ్లలో ఎక్కడలేని అయోమయం ఏర్పడిందట. ఆ నియోజకవర్గం ఏంటంటే.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం..
మొన్నటి వరకు ఫుల్ సందడి చేసిన తెలుగు తమ్ముళ్లు.. మహానాడు తరువాత గందరగోళంలో పడిపోయారట. నియోజకవర్గంలో టీడీపీ ఓడినా ఆ తర్వాత తొలిసారిగా జరిగిన దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ఫుల్ స్వింగ్‌లోకి వెళ్లిపోయారు. అయితే టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాదుడేబాదుడు కార్యక్రమంతో, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రం జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుండి వైసీపీ అభ్యర్ది మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన శిద్దా రాఘవరావు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత వైసీపీలో చేరారు.
గత ఎన్నికల్లో దర్శినుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కదిరి బాబురావు కూడా వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ పూర్తిగా బలహీనపడిందని.. పార్టీ పని అయిపోయిందంటూ ప్రచారం జరిగింది. చాలాకాలం దర్శి టీడీపీ స్థానం ఖాళీగా ఉండిపోయింది. దీంతో పార్టీ అధిష్టానం పమిడి రమేష్ కు నియోజకవర్గ భాద్యతలు అప్పగించింది. గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత సమర్ధవంతంగానే పనిచేశారనే టాక్ పార్టీలో ఉంది. పైగా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కూడా సాధించారు. కుప్పంలో ఆ పార్టీ ఓడినా ఇక్కడ మాత్రం ఒన్ సైడ్ విక్టరీని సాధించగలిగింది.
తెలుగుదేశం పార్టీకి గెలుపునకు వైసీపీలో ఉన్న వర్గపోరు కూడా ఒక కారణం అయినా.. అందివచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ ఇంఛార్జ్ రమేష్ వినియోగించుకోవటంలో సఫలమయ్యారనే టాక్ ఉంది. దీంతో చంద్రబాబు కూడా ప్రకాశం జిల్లా నేతలందరూ సమిష్టిగా పనిచేసి క్లిష్ట పరిస్దితుల్లో పార్టీని నిలబెట్టారని, ఏపీలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా గుర్తు చేస్తున్నారు. ఒంగోలు మహానాడులో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ మహానాడు తర్వాత, దర్శి నియోజకవర్గంలో గందరగోళ పరిస్దితులు ఏర్పడ్డాయని ప్రచారం ఉంది..
అందుకు కారణం ఏంటంటే? మహానాడు కార్యక్రమ సమయంలో ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి సినీనటుడు బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలిశారు. అంతేకాదుక అవకాశం ఇస్తే దర్శి నుండి పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముందు చెప్పారట. ఈ విషయం దర్శి టీడీపీలో హాట్ టాపిక్ లా మారింది. దుబాయ్ సుబ్బారావు పేరు వినిపించగానే దర్శి టీడీపీలో గందరగోళం మొదలైందట. అదే సమయంలో పార్టీ పిలుపునిచ్చిన బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా జరగకపోవటంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం ఏర్పడింది. ఇప్పటి వరకూ ఫుల్ జోష్‌లో ఉన్నామనుకుంటున్న పార్టీ శ్రేణులకు అసలేం జరుగుతుందనే అనుమానాలు మొదలయ్యాయట.
కేడర్ అనుమానాలకు తగ్గట్టుగానే..? పార్టీ ఇంఛార్జ్ పమిడి రమేష్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదట. మహానాడు సమయంలో దుబాయ్ సుబ్బారావు పేరు సీన్ లోకి వచ్చిన తర్వాత రమేష్ అసంతృప్తిగా ఉంటున్నారని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. మరోపక్క టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే జనసేనకు దర్శి టికెట్ కేటాయించవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.