Chandrabau Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలంతా ఇప్పటికే ప్రజల బాట పడుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ అభ్యర్థుల ఎంపికను కూడా ఫైనల్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ ఎన్నికలను డూ ఆర్ డై గా భావిస్తున్నారు.. గెలుపు తప్పని సరి అనే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమ (Rayalaseema) లోని నాలుగు జిల్లాల్లో గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు (Kurnool), కడప (Kadapa), అనంతపురం (Anantapuram) , చిత్తూరు (Chitoor) జిల్లాల్లో పార్టీ జెండాను రెపరెపలాడించడంద్వారా అధికార పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల్లో వైసీపీ (YCP) కి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టడంలో వీటిది ప్రత్యేక పాత్ర. అందుకే ఆ జిల్లాలపై చంద్రబాబు దృష్టిసారించారు. తెలుగు తమ్ముళ్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే అవసరం అనుకున్నచోట సీరియస్ వార్నింగ్ లు ఇస్తున్నారు కూడా..
కుప్పం నియోజకవర్గం నుంచి ఈసారి చంద్రబాబును ఓడించడంద్వారా తెలుగుదేశం పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో పడేయాలనేది సీఎం జగన్ వ్యూహం. అందుకు తగ్గట్లుగా స్థానిక టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుపై ఎమ్మెల్సీ భరత్ పోటీచేస్తారంటూ ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. చంద్రబాబుపై రెండుసార్లు పోటీచేసి ఓటమిపాలైన చంద్రమౌళి కుమారుడే భరత్.
అందుకే ఇప్పుడు చంద్రబాబు సైతం రివర్స్ స్ట్రాటజీలోనే వెళ్తున్నారు. కుప్పంలో తనను ఓడించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు చెక్ పెట్టాలనే యోచనతో పూర్తిగా రాయలసీమపైనే దృష్టిపెట్టారు. ఇక్కడ జరిగిన మినీ మహానాడులకు, బాదుడే బాదుడు పర్యటనలకు ఇక్కడి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, దీన్ని నాలుగు జిల్లాలకు విస్తరించడంద్వారా వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఒక్క కుప్పంపైనే దృష్టిపెట్టిన వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లో పడేయాలంటే.. నాలుగు జిల్లాల్లో వైసీపీని ఓడించడం ఒకటే మార్గమనే చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇదీ చదవండి : ఫ్యాక్షన్ అడ్డాలో బాలయ్య సందడి.. శరవేగంగా NBK107 షూటింగ్.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
అందులో భాగంగానే రాయలసీమలో లోక్సభకు, అసెంబ్లీకి పోటీచేసే కొందరు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. తన సహజసిద్ధమైన నాన్చుడు ధోరణికి భిన్నంగా కొన్ని నియోజకవర్గాల్లో ముందుగానే ప్రకటిస్తే అసంతృప్తితో ఉన్నవారెవరనేది అర్థమవుతుందని, దాన్నిబట్టి ఎన్నికల ప్రణాళికలు రచించొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.. కానీ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న చోట చంద్రబాబు వ్యూహాలు పని చేయాలి అంటే స్థానిక నేతల మధ్య సమన్వయం కూడా చాలా అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP