టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికను బుధవారం కూల్చేస్తామన్న జగన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దీనిపై ఫేస్ బుక్లో ఓ పోస్టు పెట్టారు. ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక అంటూ ఆయన తన పోస్టును ప్రారంభించారు. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన పిదప, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని నా అభిప్రాయం అంటూ పోస్టు పెట్టారు. ఇప్పుడే ప్రజావేదికను తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలుగా నష్టం వస్తుందన్నాను కేశినేని. ప్రజావేదికను ప్రజాధనంతో నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ సొమ్ము వృథా అవుతుందన్నారు. మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుందని తన అభిప్రాయమంటూ పోస్టు పెట్టారు కేశినేని.
సోమవారం ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేస్తామన్నారు. ప్రజావేదిక నుంచే అక్రమ కట్టడాల కూల్చివేత మొదలవుతుందన్నారు. బుధవారమే ప్రజావేదికను కూల్చేస్తామన్నారు సీఎం. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పడానికే ప్రజా వేదికలో సమావేశం పెట్టానన్నారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం నిర్వహించానన్నారు జగన్. మనం తప్పులు చేస్తే ఎదుటివాళ్లను ఎలా ప్రశ్నించగలం? అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kesineni Nani, TDP