ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ మద్యం, పెగాసస్ ఇష్యూ (Pegasus) లపై సభలో గందరగోళం నెలకొంటోంది. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజూ నిరసన తెలుపుతున్న టీడీపీ సభ్యులు.. బుధవారం సభలో చిడతలు వాయిస్తూ నిరసన తెలిపారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చిల్లరపనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ (TDP) సభ్యులు బయటకెళ్లి భజన చేసుకోవాలని సూచించారు. సభ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఇది సరికాదనన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినరా.. రోజూ ఇలాగే చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని కించపరుస్తున్నారని.. నిన్న ఈలలు వేశారని.. నేడు చిడతలు వాయిస్తూ సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సభకు రాకుండా, అసెంబ్లీలో వారి సభ్యులచేత అదే పనిగా అల్లరి చేయిస్తూ, చాలా నీచాతి నీచానికి దిగజారుతున్నారని., టీడీపీ నీచ రాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే.. ప్రజలే వీరికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) మండిపడ్డారు. తనదైన శైలిలో చంద్రబాబుపై, టీడీపీపై విమర్శలు చేశారు. చంద్రబాబు అళ్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు నాశనం అవుతారన్నారు. టీడీపీకి తెలంగాణలో ఏ గతి పట్టిందో.. ఏపీలో కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అక్రమ మద్యానికి ఆద్యుడు చంద్రబాబేనని.. చీపల్ లిక్కర్ కనిపెట్టిందే ఆయనన్నారు. చంద్రబాబు దిగిపోతూ ఐదేళ్లపాటు బార్లకు పర్మిషన్ ఇచ్చారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. జే బ్రాండ్స్ అంటూ టీడీపీ అంటున్న బ్రాండ్లకు బాబే పర్మిషన్ ఇచ్చారని ఆయన విమర్శించారు. చంద్రబాబు 240 బ్రాండ్లకు అనుమతులిచ్చారన్నారు. చిడతలు కొట్టి సస్పెండ్ అయి రావాలని చంద్రబాబు చెప్పి ఉంటారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.
ఇదిలా ఉంటే అక్రమ మద్యానికి నిరసనగా విజయవాడ శివారు ప్రసాదంపాడులోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని శ్వేతతో పాటు పలువురు నేతలను అడ్డుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly