ఓ వైపు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు జరుగుతున్నాయి. సభలో అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ కౌంటర్లిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీకి షాకిచ్చారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన రాజీనామాను ఆమోదించాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖరేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతేడాది ఫిబ్రవరి 21న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఐతే ఇప్పటివరకు ఆమోదించకపోవడంతో ఆయన స్పీకర్ కు లేఖ రాశారు. ఇప్పటి వరకు రాజీనామా ఆమోదించి కపోవడం సరైంది కాదనీ.. నా రాజీనామా ఉద్యమానికి బలం చేకూరుతుందని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని నా రాజీనామా కార్మిక సోదరులకు ఉపయోగపడుతుందని గంటా పేర్కొన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం రేగిన సంగతి తెలిసిందే విశాఖలో స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నవారితో పాటు కార్మిక సంఘాలు, రాజకీయల పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లోనే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అసెంబ్లీకి పంపారు. రాజీనామా చేసి ఏడాదైనా ఆమోదించకపోవడంతో ఆయన లేఖరాశారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రభుత్వం దూకుడు పెంచెందని.. ప్లాంట్ మొత్తం విలువని లెక్కించేందుకు కన్సల్టెన్సీ నియామకానికి ఈ నెల 11 వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చిందని గంటా అన్నారు. విస్తృత ప్రయోజనాలు ఆశించి నిస్వార్థంగా 22 వేల ఎకరాలు అందించిన నిర్వాసిత కుటుంబ త్యాగాలతో పాటు, తమ జీవితాల్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న కార్మికులు, తెలుగువారి సెంటిమెంట్ ని మరోసారి అపహాస్యం చేసినట్టుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో నా రాజీనామాను ఆమోదించాలని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నేను కట్టుబడి ఉన్నానని, నిర్వాసిత, కార్మిక సోదరులకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకు నా రాజీనామా ఉపయోగపడుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నానని గంటా పేర్కొన్నారు.
ఐతే గంటా లేఖ ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటే జగన్ కు జై కొట్టారు. గంటా టీడీపీని వీడకపోయినా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల జిల్లాల వారీగా చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో పార్టీపై ఆయన ఆసక్తిగా లేరన్న ప్రచారంజోరుగా సాగుతోంది. కొంతకాలంగా ఆయన టీడీపీ వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు వైసీపీలో చేరతారని.. కాదు బీజేపీ అని.. జనసేన వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇటీవల కాపు నేతల సమావేశానికి కూడా గంటా నేతృత్వం వహించారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరడం ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ganta srinivasa rao, Vizag Steel Plant