AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీల కీలక నేతలు.. ఇప్పటికే మెజార్టీలపై లెక్కలు వేసుకుంటున్నారు. మరికొందరైతే సీటు ఖరారు కాకపోవడంతో.. ఆ సీటు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం మెప్పు కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇప్పుడు మరో నియోజకవర్గం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. ఎందుకంటే ఇటీవల టీడీపీ లో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) .. సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరు అదే సీటు నుంచి పోటీ చేస్తే హోరా హోరీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సైకిల్ ఎక్కినప్పటికీ.. పార్టీలో ట్రబుల్ షూటర్ గా కన్నా లక్ష్మీ నారాయణ మారుతున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్న మాట. గ్రూపుల పేరుతో పార్టీలో ఎవరన్నా సమస్యలు సృష్టిస్తే కన్నా పేరు చెప్పి షాక్ ఇస్తున్నారట.
ముఖ్యంగా గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి టిడిపి నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో టికెట్స్ కోసం టీడీపీలోని కమ్మసామాజికవర్గ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఈ మూడు చోట్లా నాయకులు తమకు సీటు కావాలని అడిగితే.. ఆ సీటు మీకు కాదు.. కన్నా పోటీ చేయొచ్చు అని చెబుతున్నారట. వాస్తవానికి ఎక్కడ పోటీ చేయాలో కన్నాకే క్లారిటీ లేదని మరో ప్రచారం ఉంది.
ఆయన తెలిసినవా కానీ.. లేక మీడియా ప్రతినిధులు కానీ అయన్ను కలిసినప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అని అడిగితే.. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తా అని కన్నా బదులిస్తున్నారంట. ఇదే సమయంలో కన్నా పేరు సత్తెనపల్లిలో కాస్త గట్టిగానే వినిపిస్తోందట. ఇందుకు టీడీపీ లెక్కలు టీడీపీ దగ్గర ఉన్నాయట. సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇక్కడ మంత్రిని ఓడించాలంటే.. కన్నానే సరైన క్యాండిడేట్‌గా తెలుగు దేశం భావిస్తుంది.ః
అక్కడే ఎందుకంటే..?
గుంటూరు పశ్చిమ.. పెదకూరపాడు నియోజకవర్గాలతో పోల్చితే సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గం ఓట్లు కొంచెం ఎక్కువ. అంబటికి కాపు ఓట్లు మళ్లకుండా కన్నాను పోటీ చేయిస్తే ప్లాన్ వర్కవుట్ అవుతుందనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందట. అంతేకాదు ఈ మధ్య కాలంలో కన్నా సైతం సత్తెనపల్లిలో ఎక్కువగా పర్యటించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అలా అని కన్నా మిగతా నియోజకవర్గాల్లో తిరగడం లేదా అంటే.. వెళ్తున్నారు. కానీ సత్తెనపల్లిలో కొంచెం ఎక్కువుగా తిరుగుతున్నారనే ప్రచారం ఉంది. అయితే సత్తెనపల్లి టీడీపీలో నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురికీ కాకుండా కన్నాకు సీటు ఇస్తే.. వాళ్లంతా పార్టీ విజయం కోసం కచ్చితంగా కలిసి పనిచేస్తారని.. అలా కాదని ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు గోతులు తవ్వేస్తారనే అభిప్రాయంలో హైకమాండ్ ఉందట. సత్తెనపల్లిలో కన్నాను పోటీ చేయిస్తే.. మంత్రి అంబటికి చెక్ పెట్టినట్టు అవుతుందన్నది టీడీపీ పెద్దల లెక్క.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kanna laxminarayana, TDP