ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కి ప్రత్యేక స్థానం. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీ నలభై వసంతాలు పూర్తి చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కి ప్రత్యేక స్థానం. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీ నలభై వసంతాలు పూర్తి చేసుకుంది. 1982 మార్చ్ 29 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.అప్పట్లో అదొక సంచలనం.రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తూ అప్పటి తెలుగు వెండితెర రారాజు నందమూరి తారక రామారావు తీసుకున్న నిర్ణయం ఆవేశపూరితమైనది అని చెప్పడానికి సంకోచించవలసిన అవసరం లేదనే అనుకుంటున్నా.తె.దే.పా ఆవిర్భావం తో తెలుగు రాజకీయాలలో ఒక సరికొత్త ఒరవడి ఏర్పడిందనే చెప్పాలి. నిర్ణయం ఆవేశపూరితమైనా తేదేపా ఆవిర్భావానికి ముందు ఆ తరువాత అన్నంతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఘనత ఎన్.టీ.ఆర్ దే అని చెప్పాలి.అప్పటి వరకు కొందరి కబందహస్తాలలో మాత్రమే ఉన్న అధికార అందలాన్ని సామాన్యులకు సైతం అందించిన పార్టీ టీడీపీ. కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ప్రత్యామ్న్యాయం లేని రోజుల్లో నాయకులు పదవుల కోసం కొట్లాడుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించు కోవడం మానేసిన పరిస్థితులలో, తాము ఓటు వేయడానికే తప్ప అధికారం వైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా సామాన్యుడు చేయలేని పరిస్థితులలో టీడీపీ ఆవిర్భావం ప్రజలలో నూతనోత్తేజం నిపిందనే చెప్పాలి.
రాజకీయం అంటే అదో కృష్ణ పదార్ధం (డార్క్ మ్యాటర్, అంతు చిక్కని రహస్యం) అనే భావన నుండి ప్రజల అరచేతిలో రాజకీయాలను చూపించిన ఘనత ఖచ్ఛితంగా తేలుగు దేశం పార్టీదే అని చెప్పవచ్చు. భారతదేశ ఉక్కు మహిళగా పేరుగాంచిన అప్పటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి పార్టీ స్థాపించిన ఏడాదిలోపే అధికారం కైవసం చేసుకోవడంతో టీడీపీ దేశ రాజకీయ చిత్రపటంలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది. ఆ తరువాత పరిపాలనలో కూడా రూపాయికే కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలు అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యింది.
అప్పటి వరకూ రాష్ట్రంలో ఒకే వర్గం చేతిలో ఉన్న రాజకీయాలను అన్ని సామాజికవర్గాలకు విస్తరింపజేయడంలో, రాజకీయాలలోకి యువత, విద్యావంతులను ప్రోత్సహించడం, పురుషులతో పాటు మహిళలకు కూడా ఆస్థిలో సమాన హక్కు కల్పించడం, అట్టడుగు వర్ణాలపై అగ్రవర్ణాల దాడులు నిలువరించడం కోసం S.C ST ఎట్రాసిటి యాక్ట్ తీసుకు రావడం, అప్పటి వరకు రాజకీయాలవైపు కనీసం తొంగిచూడని బి.సి సామాజకవర్గాల నుండి సగానికి పైగా సభ్యులను శాసనసభకు పంపించడం లాంటి సంచలన నిర్ణయాలతో పాటు జన్మతః కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వైరంతో నేష్నల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలోని కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకంచేయడంలో ఎనలేని కృషిచేసిన పార్టీగా తెదేపా కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.నేష్నల్ ఫ్రంట్ ,యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో గాని, వాటి మనుగడలో గాని తె.దే.పా కీలకమైన పాత్ర పోషించిందనేది కాదనలేని సత్యం.
1983 నుండి నేటి వరకు గడచిన నలభై సంవత్సరాలలో సగకాలంపాటు అధికారంలో మిగతా సగకాలం ప్రతిపక్ష పాత్ర పోషించడమే కాకుండా దేశ రాజకీయాలలోనూ చక్రం తిప్పిన ఘనత కూడా సాధించింది. పార్టీ ఆవిర్భావం నుండి గడచిన నాలుగు దశాబ్దాలలో తె.దే.పా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. పార్టీ ఆవిర్భవించిన ఏడాదిలోపే అధికారం పొందిన టీడీపీ ప్రభుత్వాన్ని ఆరునెలలు తిరక్కుండానే ఆ పార్టీ నేత నాదెండ్ల.భాస్కరరావు కాంగ్రెస్ పార్టీతో కలిసి కూలదోయడం వంటి సంఘటన, ఎన్టీ ఆర్ నుండి పార్టీతో ప్రభుత్వ పగ్గాలు రెండూ చంద్రబాబు చేతికి మారిననాటి అంతర్గత సంక్షోభం, 2009, 2014లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభంజనం వంటి అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఘనత తెలుగు దేశం పార్టీ సొంతం.
పార్టీ స్థాపించిందిఐమొదలు ఎన్నో ఆటుపోటులను తట్టుకుని నిలబడిన టీడీపీ 2019 ఎన్నికలలో ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడాన్ని పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. పార్టీ పట్ల కార్యకర్తలలో ఒక విధమైన నిస్తేజం ఆవహరించినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా వరకు పార్టీ క్యాడర్ స్తబ్దుగా ఉండిపోయింది. రాజకీయాలలో అపర చాణుక్యునిగా పేరు గాంచిన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వయసు మీదపడటంతో మునుపటంత ఉత్సాహంగా పార్టీ పై ధృష్టి సారించలేక పోతున్నారని, ఆయన కుమారుడు లోకేశ్ కొంతమేర ప్రయత్నిస్తున్నా ఆయన పట్ల క్యాడర్ లో పెద్దగా నమ్మకం కలగడం లేదనే ప్రచారమూ లేక పోలేదు.
ఐతే ప్రస్తుత పరిస్థితులలో నలభై వసంతాల వేడుకలు, త్వరలో నిర్వహించనున్న పార్టీ మహానాడు కార్యక్రమాలు క్యాడర్ లో ఉత్సాహాన్ని ,మనోస్థైర్యాన్ని పెంపొందిచేలా ఉంటాయని ఆ పార్టీ నాయకులు తెలియ జేస్తున్నారు. రాబోయే రెండేళ్ళలో తిరిగి అధికారం చేజిక్కించు కుంటామని,పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని నేతలు భరోసా ఇస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ నలభైవసంతాల తె.దే.పా పరిస్థితి ప్రస్తుతానికి పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా గట్టిగా ప్రయత్నిస్తే పూర్వవైభవం పొందడం ఖాయమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.