టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పంలో పర్యటిస్తున్నారు. బుధవారం శాంతిపురం మండలం బెల్లకోకిల, అనికెర క్రాస్ లో రోడ్ షో నిర్వహించిన ఆయన వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని.. ఎక్కడ చూసినా చూసినా బాదుడే బాదుడంటూ ఎద్దేవా చేశారు. రాని కరెంట్ కు బిల్లుల మోత మోగిస్తున్నారని.. గత నెల కంటే కరెంట్ బిల్లులు డబుల్ అయ్యాయని మండిపడ్డారు. కరెంట్ ఇవ్వలేని వాళ్ళు బిల్లు లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ కుప్పంపై కక్షగట్టారని., ప్రజావేదిక కూల్చి జగన్ విధ్వంసానికి నాంది పలికారని విమర్శించారు.
90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేది లేదని., ఇప్పుడు పంట దెబ్బతిన్నా ఒక్క అధికారి రాలేదని చంద్రబాబు మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని.., రెండేళ్లలో పోయే జగన్ మీటర్లు పెట్టిపోతే ఎలాగని నిలదీశారు. ప్రజల రక్తం తాగే వ్యక్తి జగన్ అని.., ఒక జలగలా తయారై అన్నింటిపై పన్నులు వేసి ప్రజల రక్తం పీల్చుతున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 95 శాతం హామీల అమలు ఎక్కడ జరిగిందో జగన్ చెప్పాలన్న చంద్రబాబు., 8 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు లేవని.., మీ అబ్బ సొమ్మా? అని ప్రశ్నించారు.
పిల్లలను ఇంజనీర్, మెడిసిన్ చదివించాలి అంటే నారాయణ, చైతన్య సంస్థలు గుర్తుకు వస్తాయని.., జగన్ రాజకీయ కక్షతోనే నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటే వైసీపీ వాళ్లు ఉండేవాళ్లా అని ప్రశ్నించారు. అసలు మానవత్వమే లేని సీఎం జగన్ అని.., కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉన్న నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 మంది టీడీపీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారని.., అలాగే నలుగురు మాజీ మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిలో అసలు రింగ్ రోడ్డే లేదని.., అసలు రోడ్డే లేని చోట అక్రమం జరిగిందని కేసులెలా పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని అంతా గ్రాఫిక్స్ అని చెప్పినవాళ్లే ఇప్పుడు రింగ్ రోడ్డులో అక్రమాలు అని కేసు పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ కు బయట తిరిగే అర్హత లేదని.., జీవితాంతం జైలు పక్షిగా ఉంటారని జోస్యం చెప్పారు. 88 శాతం పూర్తైన హంద్రీనీవా పనులు ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించిన చంద్రబాబు.. తాను పులివెందులకు నీళ్లిస్తే.. జగన్ మాత్రం కుప్పంకు నీళ్లు ఆపారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu