ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వరద (AP Floods) ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) పర్యటన కొనసాగుతోంది. బుధవారం చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరద నష్టం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేనని ఆయన మండిపడ్డారు. వరదలకు మానవ తప్పిదాలే కారణమన్న ఆయన.. ప్రభుత్వానికి వాటర్ మేనేజ్ మెంట్ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హచ్చరించినా ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని చంద్రబాబు ఆరోపించారు.
గొలుసుకట్టు చెరువులు ఉన్నప్పుడు వరద రాకముందే నీటిని విడిచిపెట్టాల్సి ఉంటుదంని.. అలా చేయని పక్షంలో చెరువులన్నీ నిండిపోయి వరద తీవ్రద పెరిగే ప్రమాదం ఉందని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించలేదని చంద్రబాబు అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలోనే ఉండి నివారణ చర్యలు చేపట్టానన్నారు. అలాగే ఇలాంటి సమయాల్లో రాత్రిపూట కూడా పనిచేసినట్లు ఆయన గుర్తుచేశారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని.. వారికి సాయం అందేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.
అందుకే నుంచి బయటకు వచ్చా..!
ఆంధ్రప్రదేశ్ ను తెలుగుదేశం పార్టీ 22 ఏళ్ల పాటు పాలించినా తన భార్య భువనేశ్వరి ఏనాడూ బయటకు రాలేదని చంద్రబాబు చెప్పారు. అలాంటి తన భార్య వ్యక్తిత్వంపై వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో కించపరిచేవిధంగా మాట్లాడారని చంద్రబాబు అన్నారు. అలిపిరిలో బాంబులు పెట్టి తనను హతమార్చేందుకు యత్నించినా భయపడలేదని.. తన భార్యపై చేసిన వ్యాఖ్యలను మాత్రం తట్టుకోలేకపోయానన్నారు. కౌరవ సభలో గౌరవం లేదనే బయటకు వచ్చానని.. మళ్లీ తానే సీఎంగా గెలుస్తానని.. అప్పుడే సభలో అడుగుపెడతానని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నానని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ పెట్టిన అక్రమకేసులపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కుప్పంలో రౌడీయిజం
ఇక కుప్పంలో వైసీపీ దౌర్జన్యం, రౌడీయిజం చేసి గెలిచిందని చంద్రబాబు ఆరోపించారు. చిన్నపట్టణంలో అక్రమాలతో గెలిచిన వైసీపీ నేతలు తామేదో మొనగాల్లమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. దొంగఓట్లతో దౌర్జన్యం గెలిచిన ఘనత వైసీపీదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎవరికోసం పోరాడుతోందో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కంపెనీలను తీసుకొస్తే.. వీళ్లేమో దందాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఉన్మాదులతో పోరాడాలా..? అని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Floods, Chandrababu Naidu, Chittoor, TDP