AP POLITICS TDP CHIEF CHANDRABABU NIADU WROTE A LETTER TO DGP ON FALLOWER KILLED NGS GNT
Chandrababu Naidu: రాష్ట్రంలో బీసీ నేతలే లక్ష్యంగా హత్యలు..! శాంతి భ్రదతలు ఎక్కడున్నాయి..? డీజీపీకి చంద్రబాబు లేఖ..?
చంద్రబాబు (ఫైల్)
Chandrababu Naidu: ఏపీలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల హత్యలు కలకల రేపుతున్నాయి. పల్నాడులో టీడీపీ కార్యకర్త జల్లయ్య పై మారణాయుధాలతో దాడి చేసి హతమార్చిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటనపై డీజీపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు హత్యలు ఇటీవల కాలంలో పెరగడం ఆందోళన పెంచుతోంది. తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్త జల్లయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చిన ఘటన రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీసుంది. ప్రత్యర్థులు చేసిన దాడిలో గాయాలు పాలైన జల్లయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేట (Narasaraopeta) లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జల్లయ్య అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం వైసీపీ శ్రేణుల దాడిలోనే జల్లయ్య హత్య జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) కి లేఖ రాశారు.
అధికార పార్టీ అనుకూల పోలీసు అధికారుల తీరుతో పల్నాడులో శాంతిభద్రతలు గాడి తప్పాయని.. చంద్రబాబు ఆ లేఖలో రాశారు. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు ప్రాంతంలో పరిస్థితి మారిపోయిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దళితులు, బీసీలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత దాడుల భయంతో వేరే ప్రాంతంలో ఉంటున్న జల్లయ్య ఓ శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చిన క్రమంలో వైయస్సార్ సిపి గుండాలు మారణాయుధాలతో దాడి చేసి జల్లయ్య ప్రాణాలు తీశారని, బక్కయ్య, ఎల్లయ్య ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని చంద్రబాబు డీజీపీకి లేఖలో ఫిర్యాదు చేశారు.
పల్నాడు ప్రాంతంలో స్వతంత్రంగా వ్యవహరించే పోలీస్ అధికారుల నియామకం చేపట్టాలని లేఖలో చంద్రబాబు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుకూలంగా ఉండే పోలీస్ అధికారుల నియామకంతోనే పరిస్థితులు గాడి తప్పుతున్నాయని ఆరోపించారు. పల్నాడులో వరుస ఘటనలు పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతున్నాయని చంద్రబాబు తెలిపారు.
హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య కుటుంబ సభ్యులను ఫోన్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తోంది సామాజిక అన్యాయమని, ఒక పక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని మట్టుపెట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేసారన్నారు. సీఎం జగన్ బినామీ పిన్నెల్లి నియోజకవర్గం మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారని, రాష్ట్రవ్యాప్తంగా వరుసగా బీసీ నేతల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని లోకేష్ అగ్రహం వ్యక్తం చేశారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.