AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU SLAMS YCP GOVERNMENT AND CM JAGAN MOHAN REDDY NGS
Chandrababu: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది అదే.. జేఎస్టీ కట్టాల్సి వస్తోంది అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు (ఫైల్)
Chandrababu On Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. అంతా ముందస్తు ఎన్నికలకే సిద్ధమవుతున్నట్టు ఉన్నారు. అందుకే అధికారి-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వైఎస్ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chandrababu On Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ఇకపై నుంచి ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండాలని.. అలా కష్ట పడిన వారికే మళ్లీ సీట్లు ఇచ్చేది అని తేల్చి చెప్పేశారు. ఇటు జనసనే అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఓ అడుగు ముందుకు వేసి.. మేనిఫెస్టో కూడా ప్రకటించారు. పొత్తులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. ఇక టీడీపీ సైతం ఎన్నికల్లో ఒక్కొక్కరికీ సీట్లు కూడా ఖరారు చేసుకుని వస్తోంది. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. అందుకే అధికార -విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) నివాళి అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమపై జరిగిన వేధింపులను ఆర్యవైశ్య వర్గ నేతలు, వ్యాపారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టిశ్రీరాములు అని అన్నారు. ఆ అమరజీవి సేవలను ప్రతి తరం గుర్తు పెట్టుకుంటుంది అన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ వేధింపులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీరాజ్యం అయిపోయిందని ధ్వజమెత్తారు. తనకు రౌడీయిజం తెలియదన్న చంద్రబాబు, తాను ఎప్పుడూ రౌడీలను ఉపేక్షించలేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం వ్యాపారులను తీవ్రంగా వేధిస్తోందని, వసూళ్లకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జీఎస్టీతో పాటు జేఎస్టీ (జగన్ ట్యాక్స్) అదనంగా కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లిన రాజకీయ వేత్త కొణిజేటి రోశయ్య అని చంద్రబాబు కితాబిచ్చారు. రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టర్ అంటే రోశయ్య పేరు గుర్తుకు వస్తుందన్నారు. రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో రోశయ్య పేరు ఎందుకు పెట్టరు? అని జగన్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
అలాగే రోశయ్యకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్ కు మనసు రాలేదన్నారు. మాజీ సీఎంలు వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే, ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టి గౌరవించామని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కొణిజేటి రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కల్తీసారా వల్ల జంగారెడ్డిగూడెంలో ప్రజలు చనిపోతే… సీఎం జగన్ సహజ మరణాలు అనడం చాలా దారుణం అన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే… ఇక ఎవరూ ఇక్కడ బతకలేరు, బతకనివ్వరు అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.