ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకానికి (Jagananna Ammavodi Scheme) విద్యుత్ వినియోగానికి లింక్ పెట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పథకం అమలును జనవరి నుంచి జూన్ కు వాయిదా వేయడంపై విమర్శలు వస్తుండగా.. తాజాగా నిబంధనలు కఠినం చేయడాన్ని కూడా తప్పుబడుతున్నాయి. 300 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించినా, ప్రభుత్వం ఇచ్చిన కొత్త రైస్ కార్డు లేకపోయినా, కొత్త జిల్లాల ప్రకారం ఆధార్ కార్డులో మార్పులతో పాటు 75శాతం హాజరు నమోదు ఉండాలని స్పష్టం చేసింది. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తేడాలున్నా పథకం వర్తించదని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అమ్మఒడి విషయంలో ప్రభుత్వ నిబంధనలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పథకం అమలుపై ట్విట్టర్లో సెటైర్లు వేశారు. "తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్ద ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసారు. 300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే కట్, ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్లో్ కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి గారు? మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేసారు. అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు.
కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మ ఒడి పధకం తీరు. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్ద ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి..(1/3) pic.twitter.com/BlZohVGRa7
— Lokesh Nara (@naralokesh) April 15, 2022
మరోవైపు ప్రభుత్వం తీరుపై జనసేన పార్టీ కూడా మండిపడింది. అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసుకొనేందుకు సిద్ధమైందని.., అందులో భాగంగానే ‘అమ్మ ఒడి’ పథకాన్ని క్రమంగా పక్కకు పెట్టేసేందుకే ఆంక్షలు విధిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పథకం నుంచి ఒక్క నయా పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని.., రాబోయే విద్యా సంవత్సరంలో కూడా అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని ఇప్పటి నుంచే జగన్ ప్రభుత్వం ఆలోచనలు మొదలుపెట్టిందన్నారు. అందులో భాగంగానే విద్యుత్ వాడకం 300 యూనిట్ల దాటితే అమ్మ ఒడి కట్ చేస్తామని ప్రకటించారని విమర్శించారు. వేసవి కాలంలో విద్యుత్ వాడకం కచ్చితంగా పెరుగుతుందని., ఇప్పటి వాడకం ప్రకారం చూస్తే కచ్చితంగా ఎక్కువ యూనిట్లు ఉంటాయని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని కావాలనే ఈ సమయాన్ని ఎంచుకొని అమ్మ ఒడి పథకానికి పేద తల్లులను అనర్హులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని మనోరహ్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Janasena party, Nara Lokesh