ఏపీ వ్యాప్తంగా వైసీపీ వ్యూహాలకు తిరుగులేదని చెప్పాలి. స్థానిక ఎన్నికలు, మున్సిపల్ -కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక.. ఒకటేంటి ఆ పార్టీ రాజకీయాల ముందు విపక్షాలు తేలిపోయాయి.. ఎన్నిక ఏదైనా వార్ వన్ సైడే చేస్తూ వస్తోంది అధికార వైసీపీ. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు వైసీపీకి ఎదురు నిలిచే పార్టీగానీ.. నాయకుడు గానీ లేడన్నది వాస్తవం.. అయితే మేం ఉన్నామంటున్నారు జేసీ బ్రదర్స్.. మీసం మెలేస్తున్నారు. తొడగొట్టి చెబుతున్నారు. తాడిపత్రి జేసీ అడ్డా అని.. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీకి దక్కిన ఏకైక పీఠం తాడిపత్రి మాత్రమే.. అది కూడా జేసీ బ్రాండ్ తోనే అక్కడ గెలుపు సాధ్యమైంది. అయితే చైర్మన్ పదవి చేజారినా.. రెండో వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలని వైసీపీ భావించింది. అందుకు గత కొన్ని రోజుల నుంచి వ్యూహాలు రచిస్తూనే ఉంది. కానీ ఆ వ్యూహాలను జేసీ తిప్పి కొట్టారు. తాడిపత్రిలో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలి అనుకున్నారు MLA పెద్దారెడ్డి. దీంతో రెండో వైస్ చైర్మన్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగుతాయా అన్న అనుమానాలు ఉత్కంఠ పెంచాయి. కానీ చివరికి జేసీ ముందు ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రెండవ వైస్ ఛైర్మన్‌గా పాతకోట బంగారు మునిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ TDPకే మద్దతు ఇచ్చారు. దీంతో TDP బలం 20కి పెరిగింది. YCPకి ఇద్దరు ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ గైర్హాజరుతో ఎలాంటి నెంబర్ గేమ్ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్ చైర్మన్ అయ్యారు.
తాడిపత్రిలో గట్టిగా పట్టు పడితే రెండో చైర్మన్ పీఠం దక్కించుకోవడం వైసీపీ సాధ్యమయ్యేదే అని రాజకీయ విశ్లేషుకులు అంచనా.. కొన్ని రోజులు ముందు నుంచి తాడిపత్రిలో పరిస్థితులు కూడా అలానే అనిపించాయి. వైసీపీ దూకుడుగా ముందుకెళ్లింది. ఇటీవల తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్ కూడా ఇచ్చారు. అయితే వీరిలో టీడీపీకి సపోర్ట్ చేసిన సీపీఐ కౌన్సిలర్ కూడా ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. గత 30 ఏళ్లుగా వారంతా ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, వైసీపీకి కౌన్సిలర్ కావాలని తనకు చెపితే.. తన పార్టీకి చెందిన కౌన్సిలర్ పార్టీలోకి పంపిస్తానంటూ జేసీ సంచనల వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి రాజకీయంగా సెగలు రేపింది. దీంతో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి పరిణామాలు నెలకుంటాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ జేసీ తన మద్దతు దారులందరికీ వదలకుండా.. తనకు సపోర్ట్ గా ఉండేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో వైసీపీ వ్యూహాలు అన్నీ బెడిసి కొట్టాయి..
ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకునే రాజకీయ వ్యవహారాలు ఒకఎత్తు. అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం ఒక ఎత్తు. అక్కడ చీమ చిటుక్కుమన్నా రాష్ట్రమంతా అటువైపే చూస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అధిపత్య పోరులో ఇటు జేసీ వర్గం అటు పెద్దారెడ్డి వర్గీయులు ఎప్పుడూ నువ్వానేనా అన్నట్లు ఉంటారు. అయితే ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం జేసీ తన అధిపత్యాన్ని నిలుపుకున్నారు. అప్పటి నుంచి జేసీ వర్గానికి పెద్దారెడ్డి వర్గానికి మధ్య రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. మొన్నటి మొన్న జేసీ కుటుంబం ఆధ్వర్యంలో ఉన్న ఒక దేవాలయాన్ని దేవాదాయశాఖ ఆదీనంలోకి తీసుకోవడం తోటు జేసీ కుటుంబం తలపెట్టిన పూజలకు అనుమతులు నిరాకరించడం పెద్ద దుమారమే చెలరేగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, AP Politics, Jc prabhakar reddy