Anna Raghu, News18, Amaravati
రాజకీయ రణరంగంలో ఎన్నో వ్యూహాలు, ప్రతివ్యూహాలు మరెన్నో కుట్రలు కుతంత్రాలు దాగి ఉంటాయి. క్షణక్షణం మార్పులు చేర్పులు, ఆకస్మిక నిర్ణయాలు అనూహ్య ఫలితాలు చోటు చేసుకుంటాయి. గెలుపు కోసం ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో సామ, దాన, బేధ, దండోపాయాలు ఉపయోగించి తమ శక్తివంచన లేకుండా పోరాటం చేస్తాయనేది మనందరికి తెలిసిందే. ఐతే గడచిన దశాబ్దకాలంలో ఎన్నికల వ్యూహాలు మారిపోయాయనే చెప్పాలి. ఎన్నికల వ్యూహాలను సిద్ధంచేయడంలో ఆరితేరిన నిపుణుల బృందం ఐ ప్యాక్ సృష్టికర్త ప్రశాంత్ కిశోర్ రాకతో ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) తమ పార్టీకోసం పని చేసేలా ఒప్పించ గలిగితే సగం గెలిచినట్లే అనేంతగా ఆయా రాజకీయపార్టీలు సంబరపడిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు.
2014 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డియే కూటమి సాధించిన విజయం వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఉన్నాయనేది ఆయా రాజకీయ పార్టీల భావన. 2009 నుండి 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చేసిన స్కామ్ లు, కొన్ని రాష్ట్రాల పట్ల వ్యవహరించిన నియంతృత్వ పోకడల నేపథ్యంలో అప్పటికే ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకున్న యుపీఏ ప్రభుత్వం ఎన్నికలకు రెండేళ్ళ ముందే ఓటమి అంచుకు చేరుకున్న విషయం రాజకీయ పరిజ్ఞానమున్న చాలా మందికి తెలిసిన విషయమే. ఓ రకంగా అప్పటికే అంపశయ్య మీద ఉన్న యూపీఏపై బీజేపీ (BJP) లీడర్ షిప్ లోని ఎన్డీయే కూటమి మట్టికరిపించింది. కానీ ఆ ఎన్నికలలో బీజేపీ కూటమిని గెలిపించిన ఘనత ప్రశాంత్ కిశోర్ కు దక్కడంతో ఆయన వ్యూహాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
పొలిటికల్ మార్కెట్లో తనకు ఉన్న డిమాండ్, ఆయా పార్టీల నిస్సహాయతలను ఆసరాగా చేసుకున్న ప్రశాంత్ కిశోర్ తాను అడిగినంత ముట్టజెప్పేవాళ్ళకి తన వ్యూహాలను అందించడం ప్రారంభించాడు. చాలా సందర్భాలలో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న పార్టీలు అధిక మొత్తంలో ముట్టజెబుతామని ముందుకు వచ్చినా వారిని కాదని గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీలకే ఆయన పనిచేశారనేది కాదనలేని సత్యం. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) భారీమొత్తంలో ఇవ్వజూపినా అప్పటి ప్రభుత్వ వ్యతిరేకత, జనంలో జగన్ పట్ల ఉన్న ఆకర్షణ అంచనా వేసుకుని కొంత తక్కువమొత్తానికే జగన్ కోసం పనిచేసినట్లు సమాచారం.
అలాగే మొన్నటికి మొన్న తమిళనాడులో నాయకత్వలేమితో సతమతమవుతున్న అన్నాడీఎంకే ఎంత ట్రై చేసినా పీకే మాత్రం డీఎంకే కి సపోర్ట్ చేశారు. జయలలిత మరణం తర్వాత అన్నా డి.యం.కే లో జరిగిన పరిణామాలతో అక్కడి ప్రజలు విసిగెత్తి పోయిన విషయం ముందే పసిగట్టిన ప్రశాంత్ కిశోర్ స్టాలిన్ పంచన చేరాడనేది రాజకీయవర్గాల వాదన.
ఇక పోతే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని ఉద్ధరిస్తాడనుకున్న పి.కే ఒక్కసారిగా ఆ పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించడం పెద్దగా ఆశ్ఛర్యపడదగ్గ విషయమేమీ కాదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో నిర్మాణ లోపం, నాయకత్వ లేమి ఉన్నాయంటూ ఆయన చేసిన ట్వీట్ చూస్తే జుట్టే వుంటే విగ్గుతో పనేముంది అనేలా ఉంది. ఒకటిన్నర శతాబ్దానికి పైన దేశ రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీలో పీకే ని మించిన వ్యూహకర్తలు లేరను కోవాలా..? ఆ పార్టీ తాను ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పీకే చెప్తే తప్ప తెలుసుకోలేదనుకోవాలా..? తమ సమస్యలకు సరికొత్త వ్యూహాలు పీకే ఏమైనా తయారు చేయగలడేమోననేకదా కాంగ్రెస్ పేద్దల ఆశ..? కాంగ్రెస్ పార్టీ లోని లోపాలను ఎత్తి చూపి వాళ్ళతో పనిచేయనని చెప్పడం చూస్తుంటే ఆపార్టీ గెలుపు అవకాశాల మీద నమ్మకంలేకనే పి.కే కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగాడు అనుకోవచ్చుకదా..?
మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నట్లే ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఓట్లు రాల్చవనేది ఇప్పుడిప్పుడే కొన్ని పార్టీలు తెలుసుకుంటున్నట్లున్నాయి.అందుకే వైసీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు పి.కే సేవలు తమకు అవసరం లేదని తేల్చిచెబుతుంటే..గెలుపు అవకాశాలు ఉన్న పార్టీలను వెతుక్కునే పనిలో పి.కే వేట కొనసాగించవచ్చు.కాని పి.కె పని చేసిన పార్టీ గెలిచిందా లేక గెలిచే పార్టీకి పి.కే పనిచేస్తాడా అనేది పాఠకుల నిర్ణయానికే వదిలేస్తున్నాం...!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Prashant kishor