హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త బాస్... రేసులో ఉన్నది వీళ్లే

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త బాస్... రేసులో ఉన్నది వీళ్లే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు జాతీయ స్ధాయిలో పలు సమస్యలపై బిజీగా ఉంటున్న కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు ఏపీపై దృష్టిసారించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఛీఫ్ రఘువీరారెడ్డి రాజీనామా తర్వాత ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించలేదు. దీంతో ఏపీలో కాంగ్రెస్ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. రోజువారీ కార్యక్రమాల నిర్వహణ కూడా ఎవరూ పట్టించుకోలేని పరిస్ధితి. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఐదు నెలలుగా జాప్యం చేస్తూ వచ్చింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు జాతీయ స్ధాయిలో పలు సమస్యలపై బిజీగా ఉంటున్న కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు ఏపీపై దృష్టిసారించారు.

అధ్యక్ష పదవి కోసం తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, కాకినాడ మాజీ ఎంపీ ఎం.ఎం.పళ్లంరాజు, బాపట్ల మాజీ ఎంపీ జేడీ శీలంలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పేర్లు కూడా వినపడుతున్నాయి. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై క్షేత్రస్ధాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టాలని ఏపీ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్ చాందీని అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు.


సోనియా ఆదేశాల మేరకు నవంబర్ 1న విజయవాడ రానున్న ఊమెన్ చాందీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని స్ధాయిల నేతలతో రెండు రోజు పాటు సమావేశం కానున్నారు. ఇందులో వ్యక్తమైన అభిప్రాయాల ఆధారంగా సోనియాగాంధీకి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం అధిష్టానం ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ఏపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న వారంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దశాబ్దాలుగా ఏలిన రెడ్డి సామాజిక వర్గం నేతలు కాకపోవడం, బలహీన వర్గాల వారిలో ఏకాభిప్రాయం లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యవహారం అంత సులువుగా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్ర్లంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంతో పాటు తాను బతికున్నంతకాలం ఓ రేంజ్ లో నిలిపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆ పార్టీకి కష్టకాలం మొదలైంది.

వైఎస్ తర్వాత అధికారం పగ్గాలు అందుకోవాలని భావించిన ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలు అందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీని వీడారు. అంతటితో ఆగకుండా తన వరుస పోరాటాలతో అప్పటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలకు కంట్లో నలుసుగా మారిపోయారు. అయినా కోటరీ మాటలు విని వాస్తవం గ్రహించని కాంగ్రెస్ అధిష్టానం దీనికి మందుగా కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకని జగన్ ను ఏపీకి పరిమితం చేసే లక్ష్యంతో రాష్ట్ర విభజనను తెరపైకి తెచ్చింది.

2014లో జరిగిన రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో జవసత్వాలు కోల్పోవడమే కాకుండా ఏపీలో అయితే ఉనికే లేకుండా తయారైంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు కూడా గెల్చుకోలేని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏదో మాయ చేస్తుందని ఇక్కడ ఓటర్లు కానీ ఇతర పార్టీలు కూడా భావించడం లేదు. దీంతో కాంగ్రెస్ స్ధానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ కూడా జోరుగా పావులు కదుపుతోంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మరోసారి తనకు గతంలో అండగా నిలిచిన రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి కనుచూపు మేరలో రాష్ట్ర స్ధాయిలో పార్టీకి నాయకత్వం వహించే నేతలు కానరాకపోవడంతో ఎస్సీ సామాజిక వర్గం నుంచి నేతలకు పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో అద్భుతాలేవీ జరగకపోతే చింతామోహన్, జేడీ శీలంలో ఒకరికి పగ్గాలు లభించే అవకాశముంది. అలా కాదని ఒకప్పటి తమ బలమైన కాపు సామాజిక వర్గాన్ని చేరదీయాలంటే మాత్రం పళ్లంరాజుకు అవకాశం లభించవచ్చు.

సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 కరెస్పాండెంట్, అమరావతి

First published:

Tags: AP Congress, AP News, AP Politics, Raghuveera Reddy, Sonia Gandhi

ఉత్తమ కథలు