టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ (Pegasus) ను కొనుగోలు చేసిన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) తో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీ సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్‌పై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాన్నారు. పెగాసస్ కొనలేదని ఇప్పటికే డీజీపీ కార్యాలయం తెలిపిందని.., అప్పటి డీజీపీ ఆఫీస్ కాకుండా మరొకరు కొన్నారని ఆరోపిస్తున్నారన్నారు. అయినా కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కాలేదు.. అందరూ నిశ్చితంగా ఉండండాలని ఏబీ స్పష్టం చేశారు.
అసత్యాలు, అసంబద్ధ వాదనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టవద్దని.., ఎప్పుడూ కొనని, వాడని దానికి నాకు ముడిపెట్టడం ఏమిటో అర్థం కావడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వంలో నిఘా ఛీఫ్‌గా ఉన్నందున నాకు పూర్తి సమాచారం ఉందన్నారు. మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్ కొనలేదని.., మే 2019 తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదన్న ఆయన.. తనపై ఆరోపణలు చేయడం పరమ టైమ్ వేస్ట్ తప్ప మరొకటి కాదన్నారు.
ఇదే విషయమై తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మూడు వినతి పత్రాలు ఇచ్చానని.., నన్ను ఇరికించడం కోసం కొందరు అధికారులు తప్పుడు పత్రాలతో విఫలయత్నాలు చేస్తున్నారని ఏబీ విమర్శించారు. ఈ అధికారుల ప్రయత్నాలపై రుజువులతో సహా సమర్పించి విచారణ జరపాలని కోరానని.. కానీ ఇంతవరకూ స్పందన లేదన్నారు. ఏపీ నుంచి కొన్ని పత్రాలు రాలేదని కేంద్రం చెబుతోందన్న ఏబీ.. తన సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు.
తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేయత్నాలు చేసినవారిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి సీఎస్ అనుమతి కోరినట్లు ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు, వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అబ్బయ్యచౌదరి, విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు. తనపై సీపీఆర్వో చేసిన ప్రచారానికి, ప్రభుత్వ చార్జిషీట్‌కు ఏమైనా పొంతన ఉందా? అని ప్రశ్నించారు.
తాను రూపాయి తిన్నట్టుకాని ప్రభుత్వానికి నష్టం చేసినట్టుగానీ చార్జిషీట్లో లేదని.. తాను దేశద్రోహినంటూ ఛార్జ్ షీట్ లో ఎక్కడుందో చెప్పాలని ఏబీ డిమాండ్ చేశారు. నా కుమారుడిపై చేసిన ఆరోపణలు చార్జిషీట్లో ఎందుకు లేవన్న ఆయన.. సీఐలకు పదోన్నతి విషయంలోనూ నాపై అసత్యాలు ప్రచారం చేశారన్నారు. ఒకే సామాజికవర్గం వారు ఉన్నారనడం అబద్ధమని హోంమంత్రే చెప్పారని గుర్తు చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏమన్నారో స్పష్టత లేదన్న ఏబీ వెంకటేశ్వరరావు.., పెగాసస్ అమ్ముకునేందుకు వచ్చినవారు పలువురి పేర్లు చెప్పారని తెలిసిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.