హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala: హరీశ్ రావుకు ఏపీ ప్రభుత్వం కౌంటర్.. పర్సనల్ సమస్యలు ఉన్నాయేమో అంటూ..

Sajjala: హరీశ్ రావుకు ఏపీ ప్రభుత్వం కౌంటర్.. పర్సనల్ సమస్యలు ఉన్నాయేమో అంటూ..

హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

Harish Rao: ఏపీలో ఉపాధ్యాయుల ప‌ట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. వారి రాష్ట్ర విషయాలను ఆయన చూసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాము స్పందిస్తే మరింత రచ్చ కావడం మినహా మరేమీ ఉండదని తెలిపారు. హరీశ్ రావు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని వ్యాఖ్యానించారు. రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల మంచే జరుగుతుందని... దీనిపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేసే విమర్శలను తాము పట్టించుకోబోమని సజ్జల స్పష్టం చేశారు.ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తోందని... వారికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమని అన్నారు.

  అంతకుముందు ఏపీలో ఉపాధ్యాయుల ప‌ట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం సిద్ధిపేట‌లో ఉపాధ్యాయ సంఘం స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయుల ప‌ట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని హ‌రీశ్ రావు ఆరోపించారు.

  అయితే తెలంగాణ‌లో ఉపాధ్యాయుల‌తో త‌మ ప్రభుత్వం స్నేహపూర్వకంగానే ఉంటోందని అన్నారు. ఏపీలో ఉపాధ్యాయుల‌పై కేసులు పెడుతున్న ప్రభుత్వం వారిని జైల్లో వేస్తోందని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగుల‌కు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క తెలంగాణేన‌ని హరీశ్ రావు అన్నారు. ఇంత మేర ఫిట్‌మెంట్ దేశంలో ఎక్కడా లేదన్నారు.

  ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌రిస్థితి ఎలా ఉందో గ‌మ‌నిస్తే... తెలంగాణ‌లో త‌మ ప్రభుత్వం ఉద్యోగుల‌తో ఎంత ఫ్రెండ్లీగా ఉంద‌న్న విష‌యం అర్థమవుతుందని హరీశ్ రావు అన్నారు. అయితే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనిపై మళ్లీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తారా ? లేక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారా ? అన్నది చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Harish Rao

  ఉత్తమ కథలు