ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan), టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ఒకే సమయంలో ఢిల్లీ (Delhi) వెళ్లడంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పొలిటికల్ ఓ రేంజ్ లో సాగుతోంది. ప్రధాని మోదీ తమకు ప్రాధాన్యత ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారానికి వైసీపీ (YSRCP) గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. చంద్రబాబుకు మోదీ కేవలం ఐదు నిముషాలు టైమ్ ఇస్తే.. జగన్ కు ఏకంగా గంట ఇచ్చారంటూ మాటకు మాట సమాధానం చెబుతున్నారు. అంతసేపు ప్రధానితో ఉన్నా జగన్ ప్రచారం చేసుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీ టూర్ పై టీడీపీ నేతల కామెంట్స్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. మోదీ కాసేపు మాట్లాడితే బాబు ఎందుకంత పులకరించిపోతున్నారో చెప్పాలన్నారు. అంతేకాదు చంద్రబాబు.. మోదీ ఎదుట కొత్త ప్రతిపాదన తెచ్చారన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా చంద్రబాబు తనకు తెలిసిన అన్ని విద్యలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు ఛీత్కరించి మూడేళ్లు అవుతోందని.. ఆయన్ను చిత్తుగా ఓడించారన్న విషయాన్ని మర్చిపోయారన్నారు.
ఢిల్లీలో చంద్రబాబు ప్రవర్తనను బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీకి ఉపయోగపడే విధంగా తాము, పవన్‌కళ్యాణ్ పని చేస్తామని, అందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌లో తమకు సహకరించమని కోరుతున్నట్లు అనిపిస్తోందంటూ సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయత్నం ఇప్పుడు కాదని.., గత నాలుగైదు నెలలుగా కొనసాగుతోందన్నారు. వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించి, ఏం చేస్తామనేది కాకుండా, తెలంగాణలో మద్దతు ఇస్తామని చెప్పడం ఏమిటి? ఇదేమన్నా వన్ ప్లస్ వన్ విధానమా? అని ప్రశ్నించారు.
అసలు బీజేపీకి చంద్రబాబుపై అంత విశ్వాసం ఉందా? ఆయన వల్ల నిజంగా ఆ పార్టీకి ప్రయోజనం ఉంటుందా? అలా అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు చంద్రబాబు మద్దతు ఇచ్చాడని సజ్జల నిలదీశారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని.., పవన్‌కళ్యాణ్ కూడా చెబుతున్నారని.. దీనిని చంద్రబాబు ఆసరాగా చేసుకుంటున్నారని విమర్శించారు. ఎంతసేపూ ఇలాంటి విన్యాసాలు, పిల్లిమొగ్గలు వేయడం కాకుండా, తనకు తాను ఇది చేశాను అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు.
పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్న తన కేడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్న సజ్జల.., ఈ వయసులో చంద్రబాబు వ్యవహార శైలి సక్రమంగా లేదని., ఆయనలో ఏదో సమస్య ఉందని.., ఆయనకు మానసిక స్థితి సరిగ్గా లేకుండా అయినా ఉండాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే కనీస గుర్తింపును కూడా కోల్పోతారని సజ్జల మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.