టెన్త్ పేపర్ లీకేజ్ (AP SSC Paper Leak Issue) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మాజీ మంత్రి నారాయణ (Ex Minister Narayana) అరెస్ట్ తర్వాత అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉందని ప్రభుత్వం, వైసీపీ నేతలు వాదిస్తుంటే.. ఇది కచ్చితంగా కక్షపూరిత చర్యేనని టీటీడీ కౌంటర్ వేస్తోంది. తాజాగా ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ఆరోపణలు చేశారు. టెన్త్ పరీక్షల్లో ఓ మాఫియాలా మాల్ ప్రాక్టీస్ జరిపారని.. నారాయణ విద్యాసంస్థల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయన్నారు. అన్నింటికీ ఆద్యుడు, కర్త, నిర్దేశకుడు నారాయణేనని.. ఆ విషయాన్ని సిబ్బందే చెప్పారని సజ్జల పేర్కొన్నారు.
నేర అంగీకార స్టేట్‌మెంట్‌లో అది క్లియర్‌గా ఉందన్నారు.. పక్కా ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు గగ్గులో పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మాల్ ప్రాక్టీస్‌పై ప్రభుత్వం కఠినంగా ఉంటుందని.. దీన్ని తప్పనిసరిగా చేస్తుందని అందుకే హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వానికి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నారాయణ విద్యా సంస్థల్లో జరిగింది ప్రశ్నపత్రాల లీక్ కాదని.., పరీక్ష ప్రారంభం కాగానే, పేపర్‌ను ఫోటో తీసి, కొందరి వద్దకు పంపి, సమాధానాలు రాయించి, వాటిని విద్యార్థులకు చూపడం ద్వారా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో, మొత్తం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈ వ్యవహారం జరిపారని వివరించారు. ఆ కేసులోనే అన్ని ఆధారాలతో నిన్న నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను అరెస్టు చేయడం జరిగిందన్నారు.
మరోవైపు పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ విమర్శలు చేస్తోందని.., దీనిపై సీరియస్‌గా స్పందించిన సీఎం జగన్, తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టొద్దని స్పష్టం చేశారని.., ఆ ప్రక్రియలోనే నారాయణను అరెస్టు చేశారన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడినా అది బయటరాకుండా చేసినట్లు సజ్జల ఆరోపించారు. నారాయణ సంస్థల్లో జరుగుతోంది తప్పు అని ఒప్పుకోవాల్సింది పోయి టీడీపీ నేతలు, ఆ పార్టీ అధినేత నానా యాగి చేస్తున్నారని ఆన విమర్శించారు.
అసలు నారాయణను అరెస్టు చేస్తే చంద్రబాబు ఎందుకు అంతగా భయపడుతున్నారు? ఆ విద్యా సంస్థల వెనక చంద్రబాబు ఉన్నారా? అని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్ తప్పు కాదని టీడీపీ చెప్పగలదా? నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని, ఇతర విద్యార్థులకు నష్టం జరుగుతున్నా ఆ పార్టీ సమర్థిస్తుందా అని సజ్జల నిలదీశారు. నారాయణ బిల్ కోసం అంత అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ఇంటి వద్ద వాదనలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. నారాయణ 2014లోనే ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ ఆయనే అన్నీ చూసుకుంటున్నాడన్నారు. సాంకేతికపరంగా నారాయణ ఛైర్మన్ కాకపోవచ్చు. ఆయన అల్లుడు ఇప్పుడు ఆ సంస్థలు చూస్తుంటే, రేపు ఆయనను అదుపులోకి తీసుకున్నా, టీడీపీ ఇలాగే స్పందిస్తుందా? అని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Sajjala ramakrishna reddy, TDP, Ysrcp