ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలో ఉంది. ప్రస్తుతానికి ఆ పార్టీకి తిరుగులేదు. ఐతే అక్కడక్కడా గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలకు కొదవలేదు. అంతేకాదు కార్యకర్తలే ఎమ్మెల్యేలపై అసంతృప్తితో రగిలిపోతున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ (YSRCP) కి కంచుకోటగా ఉన్న ప్రకాశం జిల్లాలో అసమ్మతి సెగ రేగింది. ఏకంగా ఈ ఎమ్మెల్యే మాకొద్దు మహాప్రభో అంటూ సొంత పార్టీ నేతలే గగ్గోలు పెడుతుండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాల విభజన తర్వాత అతి పెద్ద జిల్లాగా అవతరించిన ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఏడు వైఎస్సార్‌సీపీవి కాగా.. కొండపిలో టీడీపీ గెలుపొందింది. అయితే, జిల్లా కేంద్రం ఒంగోలుకు ఆనుకుని ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్లలో కలవకుండా పట్టుబట్టి మరీ ప్రకాశంలోనే ఉంచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గమే వైఎస్సార్‌సీపీకి తలనొప్పిగా మారింది.
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై సొంత పార్టీ నేతలే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు నేరుగా బాలినేని దగ్గర పంచాయితీ పెట్టారు. సుధాకర్ బాబును కాకుండా తమ మండలం వరకు ఒక ప్రత్యేకమైన ఇన్‌చార్జిని నియమించి పుణ్యం కట్టుకోండంటూ ఆవేదనతో విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబు సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు వాపోయారు.
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో పది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారని బాలినేని ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కేసు వాయిదాకు వెళ్లొస్తుండగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ కారు డ్రైవర్ ప్రమాదంలో మృతిచెందిన విషయాన్ని బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో వర్గ రాజకీయాలు చేస్తూ సొంత పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నారని.. నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బాలినేనికి ఫిర్యాదు చేశారు.
ఏ పనులు చేయాలన్నా కమీషన్లు తీసుకుంటున్నారని.. ఆఖరికి సీఎం సహాయ నిధి చెక్కుల్లోనూ వాటా అడుగుతున్నారంటూ ఆరోపించారు. ఏపీఎంను బదిలీ చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని డ్వాక్రా సంఘాల మహిళలు ఆరోపణలు చేశారు. దాంతో స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యే టీజేఆర్‌తో మాట్లాడతానని, అప్పటికీ తీరు మారకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ నాగులుప్పలపాడు కార్యకర్తలకు హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్‌గా పనిచేసిన టీజేఆర్ సుధాకర్ బాబు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో అధికార ప్రతినిధిగా కీలకంగా ఉంటున్న గుంటూరుకు చెందిన టీజేఆర్ సుధాకర్ బాబును 2019 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గమైన సంతనూతలపాడు నుంచి వైఎస్సార్‌సీపీ పోటీలో నిలిపింది. అంతకు ముందు 2014లో ఇదే నియోజకవర్గం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపొందారు. 2019లో సురేష్ యర్రగొండపాలెం నుంచి పోటీ చేయగా.. టీజేఆర్ సంతనూతలపాడులో పోటీ చేసి విజయం సాధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Prakasham dist, Ysrcp