GT Hemanth Kumar, News18, Tirupati
ఎన్నికలు ఉన్న లేకున్నా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) నగరి నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. నగరి రాజకీయాలు నాయకులకే కాదు ప్రజల్లో సైతం అక్కడ ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఉంటుంది. ఓవైపు వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా (Minster Roja) నియోజకవర్గం కాగా.. తరచు ఆమెకు ప్రత్యర్థి వర్గానికి మధ్య జరిగే వివాదాల కారణంగా నగరిపై అందరి అటెన్షన్ ఉంటుంది. సీఎం జగన్ ఆశీస్సులతో మంత్రి అయినా జిల్లాలో మాత్రం తాను ఒంటరవుతున్నట్లుంది వ్యవహారం. ప్రతిపక్షాలపై విరుచుకుపడే రోజాకు సొంత పార్టీలో నేతల నుంచే సవాల్ ఎదుర్కోవాల్సి వస్తోంది. నగరిలో వరుసగా రెండుసార్లు గెలిచినా వర్గ పోరును మాత్రం అణచలేకపోయారు రోజా.
ఇక వివాదాలకు కేంద్రబిందువుగా మారిన తన నియోజకవర్గంలో మంత్రి రోజా పట్టు సాధించలేదనే చెప్పుకోవాలి. అన్ని తానై నగరి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా.., వివాదాలు మాత్రం వాటిని ముందుకు కదలనివ్వడం లేదు. 2019 ఎన్నికల్లో ప్రారంభమైన వర్గ పోరు నేటికి తారాస్థాయికి చేరుకుంది. పంచాయితీ, మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనే కాకుండా పలు సందర్భాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం అయ్యాయి.
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచర వర్గంగా చెప్పుకొనే రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కేజీ కుమార్, అమ్ములు వీరి మంది మార్బలం అంతా రోజాకు వ్యతిరేక వర్గమే. గ్రూపు తగాదాలకు ఎత్తుకు పైఎత్తులు ఎన్ని వేసిన ప్రత్యర్థి వర్గం బెరుకు లేకుండా రోజాపై ప్రత్యక్ష ఆరోపణలకు దిగుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నా వెనక్కి తగ్గడం లేదు. ఐతే రోజా అసమ్మతి వర్గం రెచ్చిపోవడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు ఉన్న విబేధాలే కారణం అంటున్నారు పార్టీ నేతలు. ఇద్దరి మధ్య వివాదం ముదిరి పెద్దిరెడ్డిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగాలని అనుకున్నారు. కానీ మధ్యలో కాస్త సైలెంట్ అయ్యారు. మంత్రి పదవి రావడంతో అన్ని సెట్ అవుతాయని భావించారు రోజా. కొన్నాళ్లుగా ఆమె వ్యతిరేక వర్గాలు కూడా సైలెంట్ గా ఉండటంతో ఇక అంతా మెత్తబడ్డారనుకున్నారు. ఐతే ప్లీనరీ సాక్షిగా విభేదాలు మళ్లీ బయటపడ్డాయి.
హంగు ఆర్భాటాల నడుమ నగరి వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించారు రోజా. ప్లీనరీలోనే ఏకాకిని చేయాలనీ వ్యతిరేక వర్గం భావించింది. నగరి ప్లీనరీ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. నారాయణ స్వామి ఉమ్మడి జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, పలమనేరు, సత్యవేడు సహా పలు ప్లీనరీల్లో పాల్గొన్నారు. కానీ, నగరి ప్లీనరీలో మాత్రం కనడపలేదు. పలమనేరు వేదికగా చిత్తూరు జిల్లా స్ధాయిలో ప్లీనరీ జరిగితే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సహా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. కానీ జిల్లా నుండి మంత్రిగా ఉన్న రోజా మాత్రం ప్లీనరీకి డుమ్మా కొట్టారు. నగరిలోనే రోజా ఉన్నప్పటికీ, పలమనేరు వైపు కన్నెత్తి చూడలేదట. అదే సమయంలో నగరిలోని అసమ్మతి నేతలు కేజే శాంతి, కేజే కుమార్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మరోసారి జిల్లాలో మంత్రుల మధ్య ఏ రేంజ్ లో గ్యాప్ ఉందనే టాక్ మొదలైంది.రోజా సైతం నగరి ప్లీనరీకి అందరినీ పిలిచారా లేదనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Minister Roja, Ysrcp