AP POLITICS RIFT BETWEEN YSRCP LEADERS IN PALANADU DISTRICT AS MLAS SKIPPED PARTY PROGRAMME FULL DETAILS HERE PRN GNT
YSRCP: వైసీపీలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి.. పార్టీ ప్రోగ్రాంకి మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా.. కారణం ఇదేనా..?
ప్రతీకాత్మకచిత్రం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలో ఉంది. రాజకీయంగా ఆ పార్టీకి తిరుగులేదు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఐతే పార్టీ ఎంత ఉత్సాహంగా ఉందో.. అదేస్థాయిలో అసంతృప్తి కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలో ఉంది. రాజకీయంగా ఆ పార్టీకి తిరుగులేదు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఐతే పార్టీ ఎంత ఉత్సాహంగా ఉందో.. అదేస్థాయిలో అసంతృప్తి కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా పార్టీకి అన్ని రకాల పదవులు భారీగానే ఉన్నాయి. ఇప్పుడిదే వైసీపీలో ఆధిపత్యపోరుకు దారితీస్తోంది. కొత్త జిల్లాలు, కొత్త కేబినెట్ ఏర్పాటు తర్వాత అసంతృప్తులు బహిరంగమయ్యాయి. తాజాగా పల్నాడు జిల్లా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయం శంఖుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చేతుల మీదుగా శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఐతే ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాకపోవడం చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో ఏడుకి ఏడు అశెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా అధికారపార్టీనే కైవసం చేసుకుంది. వీరిలో ఇద్దరు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోనే నివాసం ఉంటున్నారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనలో ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం. మిగిలిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు శాసనసభ్యులు సహా ఉన్న ఒక్క ఎమ్మెల్సీ కూడా శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాకపోవడం జిల్లా వైసీపీ నేతల మద్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణ తరువాత మాచర్ల శాసన సభ్యుడు పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి వైసీపీ అధిష్టానానికి మధ్య కొంతమేర అగాధం ఏర్పడినట్లు ప్రచారం ఉంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకు మంత్రి విడదల రజని (Minister Vidadala Rajini) కి మధ్య చాలా రోజులుగా వైరం కొనసాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఇక స్థానికంగా ఉండే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యక్తి గత కారణాలు చెప్పి శంఖుస్థాపన కార్యక్రమానికి డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది.
ఐతే జిల్లాలోని శాసనసభ్యులు మంత్రులు ఒక్కరు కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి హాజరు కాకపోవడంతో ప్రజలలోని తప్పుడు సంకేతాలు వెళతాయని వైసీపీ అధిష్టానం ధృష్టికి వెళ్ళింది. దీంతో జిల్లా నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా పార్టీలో వర్గ విభేధాలు ఇలానే కొనసాగితే రానున్న రోజులలో జిల్లా పార్టీకి తీవ్రనష్టం తప్పదంటూ పార్టీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.