ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ల ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉత్కంఠకు తెరదించారు. 46వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించిన రాయన విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. మేయర్ ఎన్నికకు కొన్నిగంటల ముందు వైసీపీ తరపున గెలిచిన 49 మంది కార్పొరేటర్లతో ఓ హోటల్లో సమావేశమైన మంత్రి వెల్లంపల్లి మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి పేరును ప్రకటించారు. బీసీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... రాయన భాగ్యలక్ష్మిని ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు డిప్యూటీ మేయర్లుగా తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ కార్పొరేటర్ బెల్లం దుర్గ, సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ కుక్కల అనితను ఎన్నుకున్నారు.
ఐతే మేయర్ అభ్యర్థి ఎంపిక విజయవాడ వైసీపీలో అసంతృప్తిని రాజేసింది. ఎప్పటి నుంచో పార్టీని అట్టిపెట్టుకొని ఉంటున్న 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల మేయర్ పదవిని ఆశించారు. వైసీపీ గెలవడంతో ఆమే మేయర్ అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీ అధిష్టానం రాయన భాగ్యలక్ష్మి పేరును ఎంపిక చేసింది. ఐతే గతంలో కొందరు కార్పొరేటర్లు వైసీపీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరగా పుణ్యశీల మాత్రం పార్టీని వీడలేదు. ఈ విధేయతే ఆమెకు మేయర్ పదివి తెచ్చిపెడుతుందని అందరూ భావించారు. సీఎం జగన్ కూడా ఆమెకు మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ స్థానిక సమీకరణాల్లో నిరాశే ఎదురైంది.
బండి పుణ్యశీలకు మేయర్ పదవి రాకపోవడానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారణమనే వాదన విజయవాడలో వినిపిస్తోంది. తన నియోజకవర్గానికే మేయర్ పదవి దక్కేలా వెల్లంపల్లి మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాయన భాగ్యలక్ష్మి పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ గా కూడా పుణ్యశీలకు అవకాశం రాకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వెల్లంపల్లి తనకు తగిన గౌరవమే ఇచ్చారని ఆమె సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈక్రమంలో వెల్లంపల్లి పుణ్యశీల ఇంటికి వెళ్లి ఆమెను బుజ్జగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ దశలో కార్పొరేటర్ల సమావేశానికి గైర్హాజరైన పుణ్యశీల.. పార్టీని వీడతారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. కానీ మంత్రి బుజ్జగింపుల తర్వాత ఆమె శాంతించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విజయవాడ రాజకీయాలు ఎవరికీ అంతుబట్టవన్నది మరోసారి రుజురైందని పలువురు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, Municipal Elections, Vijayawada