M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18
ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకునే రాజకీయ వ్యవహారాలు ఒకఎత్తు. అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం ఒక ఎత్తు. అక్కడ చీమ చిటుక్కుమన్నా రాష్ట్రమంతా అటువైపే చూస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అధిపత్య పోరులో ఇటు జేసీ వర్గం అటు పెద్దారెడ్డి వర్గీయులు ఎప్పుడూ నువ్వానేనా అన్నట్లు ఉంటారు. అయితే ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం జేసీ తన అధిపత్యాన్ని నిలుపుకున్నారు. అప్పటి నుంచి జేసీ వర్గానికి పెద్దారెడ్డి వర్గానికి మధ్య రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. మొన్నటి మొన్న జేసీ కుటుంబం ఆధ్వర్యంలో ఉన్న ఒక దేవాలయాన్ని దేవాదాయశాఖ ఆదీనంలోకి తీసుకోవడం తోటు జేసీ కుటుంబం తలపెట్టిన పూజలకు అనుమతులు నిరాకరించడం పెద్ద దుమారమే చెలరేగింది.
తాజాగా తాడిపత్రిలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు కూడా ఇప్పుడు జేసీ వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాల పేరుతో జేసీ వర్గీయులను స్థానిక ఎమ్యెల్యే వేధిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో ఇప్పుడు తాడిపత్రిలో రాజకీయం భగ్గమంటుందనే చెప్పుకోవాలి. ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో వైపు పెద్దా రెడ్డీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. దీంతో ఇక్కడ వాతావరణం గతంలో ఎన్నడు లేని విధంగా వేడెక్కిందనే చెప్పుకోవాలి. అసలే రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉన్న వ్యవహారం మున్సిపల్ ఎన్నికలతో పీక్స్ కి చేరింది.
తాడిపత్రి మున్సిపాలిటీని అత్యంత తక్కువగా మెజార్టీతో కైవసం చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. మరోవైపు తాడిపత్రిలో తన ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి యత్నిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా తమను దెబ్బకొట్టాలని చూస్తున్నారని జేసీ వర్గం ఆరోపిస్తోంది. ఇప్పుడు రాజకీయ కక్షతోనే అక్రమ కట్టడాల పేరుతో తమ భవనాలను పెద్దారెడ్డి కూల్చివేయిస్తున్నారని మండిపడుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపు చర్యల ద్వారా తమ వర్గం వారిని లాక్కునేందుకు పెద్దారెడ్డి యత్నిస్తున్నారని జేసీ వర్గం విమర్శిస్తోంది.
జేసీ ప్రభాకర్ రెడ్డిని మున్సిపల్ ఛైర్మన్ పదవిని నుంచి దించడానికే ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారని ఆయన వర్గం ఆరోపిస్తోంది. తమకు అంత అవసరం లేదని పెద్దారెడ్డి వర్గం అంటోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. అక్రమ కట్టడాల కూల్చివేతల వ్యవహారం తాడిపత్రిలో మరోసారి అగ్గిరాజేస్తోందన్నది మాత్రం నిజం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, JC Diwakar Reddy, Jc prabhakar reddy