Anna Raghu, News18, Guntur
పాలిటిక్స్ (Politics) అంటేనే ఎత్తులు పై ఎత్తులు, అధికారం కోసం ఆడే చదరంగం. ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీని నడిపించే నాయకుడి తెలివితేటలు, ప్రత్యర్ధి పార్టీలను మట్టికరిపించేలా వ్యూహాలు రచించే నైపుణ్యం, ప్రజలలో నాయకునికి ఉన్న ఆదరణ ఇలా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఐతే ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ రాజకీయాలు చేసి అధికారం సాధించడం అసాధ్యం అని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. రాజకీయాలను కూడా కార్పోరేట్ వ్యాపారంలా మార్చేసి పార్టీలను ప్రజలలో మార్కెటింగ్ చేసి ఆయా పార్టీలకు ఓట్లు సాధించి పెట్టే రాజకీయ వ్యూహకర్తలు రంగప్రవేశం చేశారు. రాజకీయాలలో ఉద్దండులు, చాణుక్యులంటూ పేరుపొందిన ఎందరో పేరు గాంచిన రాజకీయ నాయకులు సైతం తమ తమ పార్టీల గెలుపు బాధ్యతలను వ్యూహకర్తలకు అప్పజెప్పడం ఆనవాయితీగా మారిపోయింది.
రాజకీయాల్లో గెలిపిస్తారన్న నమ్మకంతో ఆయా వ్యూహకర్తలకు వందలు, వేల కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించడానికి కూడా పార్టీలు వెనకాడటం లేదంటేనే వ్యూహకర్తల సత్తా ఏమిటో ఇట్టే అర్ధమవుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో వ్యూహకర్తలకు డిమాండ్ పెరిగింది.
"ప్రశాంత్ కిశోర్" (Prashant Kishore) దేశ రాజకీయాల్లో అతనొక సంచలనం. 2014 లో బీజేపీ (BJP) ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన ఆ పార్టీ గెలుపొంది అధికారం చేపట్టడంతో కీలక పాత్రపోషించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిశోర్ పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత బీహార్లో నితీష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ (CM Jagan) ,తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వంటి వారిని అధికారపీఠం ఎక్కించడంలో ప్రశాంత్ కిశోర్ కీలకపాత్ర పోషించారు. వీరంతా రాజకీయాలలో దశాబ్దాల తరబడి ఆరితేరిన వారే అనేది జగమెరిగినసత్యం. అంతే కాక నితీష్ కుమార్ మరో అడుగు ముందుకు వేసి తన ప్రభుత్వంలో ప్రశాంత్ కిశోర్ ను సలహాదారుగా నిమించి కోట్ల రూపాయలు ముట్టచెప్పడం కూడా అప్పట్లో పేద్ద దుమారమే రేపింది.
రానున్న ఎన్నికలలో ఏపీలో గెలుపుకోసం ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రశాంత్ కిశోర్ టీమ్ లో పని చేసిన రాబిన్ శర్మ తో ఒప్పందం కుదుర్చుకోగా... వైసీపీ మాత్రం ప్రశాంత్ కిషోర్ ను కంటిన్యూ చేస్తోంది. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ఇటీవలికాలంలో ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని అందుకోసం పీకే టీమ్ కు రూ.500 కోట్ల వరకు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
వ్యూహకర్తల కోసం రాజకీయపార్టీలు అధికారిక చెల్లింపులే వందల కోట్లు ఉంటే అనధికారంగా వేలకోట్లలో ఉంటుందనేది విమర్శకుల వాదన. ప్రజలకు సేవచేయాలనే తాపత్రయం ఉంటే ఇన్నేసీ వందల వేల కోట్ల రూపాయలు ఎవరైనా వ్యూహకర్తల కోసం ఖర్ఛుపెడతారా..?? వ్యూహకర్తలకు ఇచ్చే డబ్బును ఆయా రాజకీయపార్టీలు అధికారం లోకి వచ్చిన తరువాత దోచుకోవడానికి పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నాయా..?? అనే అనుమానం రాకమానదు.
ఎన్నికలలో గెలవడానికి వ్యూహకర్తలు, గెలిచిన అధికారం చేపట్టాక సలహాదారులు, అధికారం నిలుపుకోవడానికి మళ్ళీ వ్యూహకర్తలు, వ్యూహకర్తలు లేకుంటే పరిపాలన చేయడం చేతగాని నాయకులు కోట్లరూపాయల ప్రజాధనం వ్యూహకర్తల పేరిట వృధాగా ఖర్ఛు చేయడం చూస్తుంటే రాజకీయాలు ముందు ముందు మరిన్ని కార్పొరేట్ హంగులు అద్దుకుని సామాన్యులకు అందని ద్రాక్షగా మిగలడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.