GT Hemanth Kumar, News18, Tirupati
ఎమ్మెల్యే రోజా (MLA Roja) కాస్తా.. మంత్రి రోజా (Minister Roja) అయ్యారు. ఫైర్ బ్రాండ్ గా... సొంతపార్టీలోని వ్యతిరేకవర్గ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారామె. రాజకీయంగా తనదైన మార్క్ వేసుకున్న రోజా సెల్వమణికి 2014 ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తరపున విజయం సాధించారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణంనాయుడు నాయుడుపై గెలిచి శభాష్ అనిపించుకున్నారు. మొదటి సారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచే రోజాకు వర్గ విభేదాలు ఎదురైయ్యాయి. ఓ వైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఉంటే.., మరోవైపు నారాయణ స్వామి వర్గీయుల నుంచి తలనొప్పులు తెచ్చి పెట్టేవి. ముక్కుసూటి తనంతో ప్రత్యర్థులను సైతం ప్రభావితం చేయగల ఆమే.. స్వంత పార్టీ వైపు నుంచే ఇబ్బంది పడ్డారు.
ముఖ్యంగా కేజే కుమార్., అమ్ములు, రెడ్డివారి చక్రపాణి రెడ్డిలు రోజాను తీవ్ర స్థాయిలో ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. వీరందరికి పార్టీ పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు రావడంలో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణా స్వామి పత్రాలు ఉందనేది నగరిలో ఎవరిని అడిగిన చెప్తారు. అందుకే రాష్ట్ర రాజకీయాలు ఓ వైపు ఉంటే.. నగరి రాజకీయాలు మరోవైపు వెళ్తున్నాయి. వర్గ పోరుకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే నగరిలో మరో వివాదం అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ముగ్గురు మంత్రుల నడుమ నలిగిపోవాల్సిందేనంటూ వాపోతున్నారు. ఏ వర్గానికి చేస్తే ఏ మంత్రి అడ్డుపుల్ల వేస్తారో అనే భయం అధికారుల్లో ఉంది
ఆ వ్యూహంతోనే మంత్రి పదవి వచ్చిందా.?
జిల్లాల పునర్విభజన రోజాకు వరం తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. రెండు జిల్లాలో నగరి నియోజకవర్గం ఉండటంతో రెండు అంశాలను రోజా సాధించగలిగారు. చిత్తూరు జిల్లాలో ఉండి నగరి రెవెన్యూ డివిజన్ ను సాధించగా... తిరుపతి జిల్లాల్లో కొన్ని మండలాలు ఉండటంతో మంత్రి పదవిని కైవసం చేసుకున్నారనటంలో ఎలాంటి సందేహంలేదు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని కాదని రోజాకు మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితి. ఒకే జిల్లాలో ఒకే సామజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు మంత్రి పదవి దక్కే అవకావం లేదు. దీంతో సీఎం ఆశీస్సులు ఉన్న రోజాకు తిరుపతి జిల్లా అయితే రోజాకు అడ్డొచ్చే నాయకులే లేరు. ఆ ఆలోచనతోనే నగరిని రెండు జిల్లాల్లో చేర్చి మంత్రి పదవి దక్కేలా సీఎం జగన్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తిరుపతి జిల్లా నుంచే తనకు మంత్రి పదవి దక్కిందని రోజా కూడా చెప్పారు.
మంత్రి పదవి చేపట్టిన అనంతరం స్వంత నియోజకవర్గానికి చేరుకున్న రోజాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్టు రాదని, రోజా జబర్దస్త్ కె పరిమితం అవ్వాల్సిందే అని స్వంత పార్టీ నేతలే విమతమర్శలు చేస్తూ వచ్చారు. వారంతా ఆ ఇద్దరు మంత్రుల అనుచరులే అని బాహాటంగా తెలిసిన విషయమే. ధన్యవాద యాత్రలో అదే విషయంపై టికెట్ రాదంటూ చాలా మంది నానా రకాలుగా మాట్లాడారని...అలాగే ప్రతిపక్షాలు తనపై అనవసర నిందలు వేశారని...ఇప్పుడు తాను మంత్రిగా తిరిగొచ్చానంటూ గర్వంగా చెప్పుకున్నారు రోజా. ఓడిస్తాను ఓడిస్తాను అంటూ ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడేమయ్యారన్నారు.
అయితే రోజాకు మంత్రి పదవి రావడం ఇష్టం లేని కొందరు స్థానిక నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో నిమగ్నమైయ్యారట రోజా వర్గీయులు. ఇన్నాళ్లు ఇద్దరు మంత్రుల పేర్లు చెప్పుకొని కాలర్ ఎగరేసిన వారి అంతు చూస్తాం అంటూ మీసాలు మెలేస్తున్నారట. అటు ప్రభుత్వ కార్యాలయాల్లో..... ఇటు పార్టీ కార్యక్రమాల్లో తమదే పైచేయి ఉండేలా చేసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. కలసి వస్తే కలుపుకుంటాం.... విభేదిస్తే కష్టాలు తప్పవని చెప్పేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లోపు వర్గ పోరు తగ్గుతుందా.... అందరూ ఏకతాటిపైకి వస్తారా అనేది వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, MLA Roja