అన్నా రఘు Sr.కరస్పాండెంట్ న్యూస్ 18 అమరావతి
Ap Bjp: సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు. 1970 నుండి భాజపాతో ఆయన ప్రయాణం కొనసాగుతోంది. పార్టీ కేంద్ర శాఖలో సోము వీర్రాజుకి మంచి గౌరవం, గుర్తింపు ఉన్నాయి. ఆయనను దగ్గరగా చూసిన వాళ్ళు అతను వివాద రహితుడు, సౌమ్యుడిగా చెప్తారు. ఎన్ని పదవులు పొందినా పార్టీలో మాత్రం నిబద్దత కలిగిన కార్యకర్తలా పని చేస్తారని పేరు. అటువంటి వీర్రాజు ఉన్నట్లుండి కొందరికి శత్రువు ఎందుకు అయ్యారు?
మొన్న కన్నా, నిన్న పవన్ కళ్యాణ్ ఇద్దరూ వీర్రాజు వైపే వేలెత్తి చూపించారు. భా.జ.పాని వీడి తె.దే.పాలో చేరుతున్న సందర్భంలో సోము వీర్రాజు తన వర్గాన్ని కావాలనే తొక్కేస్తున్నారని..అధికార వై.కా.పాతో అంటకాగుతూ రాష్ట్రంలో భా.జ.పా ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన పార్టీ మారుతున్నారు కాబట్టి తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ అప్పట్లో వీర్రాజు ఈ విషయాన్ని ఖంఢించారు. ఇక జనసేన పదవ ఆవిర్భావ సభ సందర్భంగా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ కూడా భా.జ.పా రాష్ట్ర నాయకత్వం తనతో కలిసి రావడం లేదని..అవసరమైతే భా.జ.పాతో పొత్తు కొనసాగింపుపై పునరాలోచించుకోవడానికి కూడా సిద్ధం అంటూ ప్రకటించి పెద్ద దుమారమే సృష్టించారు.
పవన్ ప్రత్యేకంగా సోము వీర్రాజు పేరు చెప్పక పోయినప్పటికీ ఆయన టార్గెట్ మాత్రం సోము వీర్రాజే అనేది ఏ కొద్దిపాటి రాజకీయ పాండిత్యం ఉన్నవారికైనా ఇట్టే అర్ధమైపోతోంది. ఇక్కడ కన్నా కానివ్వండి..పవన్ కళ్యాణ్ కానివ్వండిఇద్దరూ సోము వీర్రాజు సొంత సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో వై.కా.పాకి రెడ్డి సామాజికవర్గం, తెదేపాకి కమ్మ సామాజికవర్గం బలమైన పునాదులుగా ఉన్నాయనేది కాదనలేని సత్యం. కాపులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఇక్కడ బలపడవచ్చనేది భా.జ.పా పెద్దల ఆలోచన. అందుకే అప్పటి వరకు పక్కా కాంగ్రెస్ వాది ఐన కన్నాకు పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేశారనే వాదన లేకపోలేదు. సాధారణంగా ఆర్ఎస్ఎస్ నేపధ్యం లేనిదే బయటి పార్టీల నుండి వచ్చిన వారికి ఆ స్థాయి పదవి దక్కడం భా.జ.పాలో అరుదుగా మాత్రమే జరిగే విషయం. ఇక కాపుల పార్టీగా చెప్పుకునే జనసేన కూడా తోడైతే కాపుల ఓట్లన్నీ తమవే అనే భావన భా.జ.పా పెద్దలలో ఉండటమే జనసేనతో పొత్తుకు మరో కారణంగా చెప్తుంటారు.
ఐతే పార్టీలో సోము వీర్రాజు ఒంటెద్దు పోకడల కారణంగానే పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యతిరేకుల వాదన. అధిష్టానం మాత్రం సోము వీర్రాజు పై నే నమ్మకం ఉంచినట్లు ఆయన అనుయాయుల వాదన. ఐతే సోము వీర్రాజు వాదన మరోలా ఉంది. తమది జాతీయ పార్టీ అని, అధిష్టానం అభీష్టం మేరకే తాను పని చేస్తున్నానని..ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పార్టీ అభివృద్దే తమ అంతిమలక్ష్యంగా తాను పని చేస్తున్నానని..వచ్చే ఎన్నికలలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఆయన తెలియజేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఏ.పిలో భా.జ.పా ఎదుగుదలకు సోము వీర్రాజు ఎంత మేరకు ఉపయోగ పడతారనేది కాలమే నిర్ణయిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Bjp, Kanna Lakshmi Narayana, Pawan kalyan, Somu veerraju