ఒకవైపు ఏపీలో ఇసుక కొరత.. మరోవైపు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ, ఆ వెంటనే కరోనా భయం.. లాక్ డౌన్ ఇలా వరుస పరిస్థితుల కారణంగా ఏపీలో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. దీనిపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి దుమారం రేపుతోంది. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యతలను ఏపీ ప్రభుత్వం జేపీ ప్రైవేట్ వెంచర్స్ లిమిటెడ్‌కు అప్పజెప్పడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇసుక తవ్వకాలను జేపీ వెంచర్స్ కు అప్పగించడం వెనుక క్విడ్ ప్రోకో జరిగిందని విపక్షాలు మండిపడుతున్నాయి. నాలుగైదేళ్లుగా జేపీ పవర్ వెంచర్స్ నష్టాల్లో ఉందని.. అలాంటి సంస్థకు ఇసుక రీచ్‌లను ఎలా అప్పజెబుతారని ప్రశ్నిస్తున్నారు.
ప్రతి ఏటా 3 వేల 500 కోట్ల నష్టాలను చవి చూస్తూ.. రేపో, మాపో దివాలా తీయబోయే కంపెనీకి ఇసుక రీచ్‌లను కట్టబెట్టడం దారుణమని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు సిమెంటు, థర్మల్ విద్యుత్తు యూనిట్ల నిర్వహణలో కాస్తో కూస్తో అనుభవం ఉందని, ఇసుక రేవులు నిర్వహించిన అనుభవం లేదని అన్నారు. అలాంటి సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించడానికి క్విడ్‌ప్రోకోనే ప్రధాన కారణమని ఆయన మండిపడ్డారు..
జనసేన సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ఇసుక సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదని, ఇసుకను ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించలేకపోయిందని.. ఇక ప్రైవేటువాళ్లు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జేపీ సంస్థను ఎలా ఎంపిక చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా భవన నిర్మాణ కార్మికులు మరోసారి రోడ్డున పడే అవకాశాలున్నాయని నాదెండ్ల ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యుడికి ఎలా భరోసా కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కమ్యూనిస్టులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ట్రాక్టర్ ఇసుకను వేయి రూపాయలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఇసుక కొరతను సృష్టించారని.. రాష్ట్రం మొత్తంమీద భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక, వినియోగదారులకు ఇసుక దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇలాంటి సమయంలో ఇసుక సరఫరా కాంట్రాక్ట్ ను దివాలా తీసిన కంపెనీకి అప్పగించటం ఆశ్చర్యకరం కలిగిస్తోంది అన్నారు. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా వస్తున్న వార్తలకు వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రామకృష్ణ.
విపక్షాలు అన్నీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. సమాన్య ప్రజలు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇసుక ధరలు భారీగా పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు. సాధరణంగా విపక్షాలు విమర్శలు చేస్తే.. మంత్రులంతా క్యూ కట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఈ ఇసుక విధానంపై మాట్లాడేందుకు మంత్రులు మాత్రం ముందుకు రావడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Sand crisis, Sand issue, Sand shortage