Anna Raghu, News18, Amaravati
ఆయనో ఎన్నారై. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలపై సోషల్ మీడియా (Social Media) లో మాట్లాడుతూ వైరల్ అవుతుంటారు. ఏపీలోని అధికార వైసీపీ (YSRCP) పై అభిమానం చూపిస్తూనే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు. అంతేకాదు న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడి కోసం దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. అయనే పంచ్ ప్రభాకర్ (Punch Prabhakar). ఎన్నారై అయిన పంచ్ ప్రభాకర్ తన యూట్యూబ్ చానల్ ద్వారా ఏపీ రాజకీయాలపై మాట్లాడుతుంటారు. వైసీపీ సపోర్ట్ గా నిలిచే పంచ్ ప్రభాకర్.. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రిపైనే విరుచుకుపడ్డారు. తాజాగా పంచ్ ప్రభాకర్ చేసిన వీడియో వైసీపీ వర్గాల్లో ఆశ్చర్యాన్ని రేకేతించింది. ఎందుకంటే వైసీపీ నేతలే ఆయన భూమిని కబ్జా చేశారంటూ పంచ్ ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ కి 175కి 175 సీట్లు రావాలంటే పార్టీ లో ఉన్న భూబకాసురలను కంట్రోల్ చేయాలని.., ప్రజల భూములను తన్నుకు పోయే గద్దలను పక్కన పెట్టాలని పంచ్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఏకంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపైనే ఆరోపణలు చేశారు. బాలినేని అనుచరుడు వెలనాటి మాధవరావు మున్సిపల్ కార్పొరేషన్ వైస్ ఛైర్మెన్ మరికొంతమంది కలిసి ఒంగోలులో భూకబ్జాలు చేస్తున్నారని పంచ్ ప్రభాకర్ ఆరోపించారు. తనకు, తన బంధువులకు చెందిన భూమిని ఆక్రమించారన్న ప్రభాకర్.. ఒంగోలులో ఖాళీ స్థలం కనిపిస్తే భూమాఫియా, ల్యాండ్ మాఫియా వాలిపోతున్నారన్నారు.
భూదందాలు చేసే వారికి రెవెన్యూ, పోలీసుల అండదండలున్నాయన్నారు. అక్రమంగా జీపీఏలు సృష్టించి భూములను దోచుకుంటున్నారన్నారు. సీఎం జగన్ తన స్వపక్షం నుండే ప్రక్షాళన ప్రారంభించాలని ఇలాంటి పనులు చేసే రాజకీయ నేతలతో పాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ను కూడా ప్రక్షాళన చేస్తే గాని జగన్ తన లక్ష్యాన్ని చేరుకోలేరన్నారు. మధ్య తరగతివారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు కొనుక్కున్న భూములను కూడా వైసీపీ నేతలు దోచేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఒంగోలు లోని గదలకుంటలో దగ్గరి బంధువులు కొనుక్కున్న భూమిని కూడా కొందమంతి కాజేశారని.. దొంగ డాకుమెంట్స్ పుట్టించి మరీ కబ్జా చేశారంటూ ఆరోపించారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదర్లేదన్నారు. ఇలాంటి పనులు చేసేవారిని సీఎం జగన్ ఉపేక్షించరంటూ పరోక్షంగా బాలినేని విమర్శించారు. అంతేకాదు నువ్వు బెదిరిస్తే బెదిరే రకం జగన్ కాదని.. ప్రజల కోసం తల్లిని, చెల్లిని పక్కనబెట్టిన వాడికి నువ్వొక లెక్కా అంటూ సవాల్ చేశారు పంచ్ ప్రభాకర్. పంచ్ ప్రభాకర్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp