ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Murder Case) లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రతి అంశం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డితో పాటు వివేకా బావమరిదిరి శివప్రకాష్ రెడ్డిపై ప్రైవేట్ కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ ప్రైవేట్ కేసు పెట్టారు. దీంతో వివేకా కేసు ఊహించని మలుపు తిరిగింది. తాజా కేసుపై విచారణ ఎలా జరుగుతుంది.. దీనిపై వివేకా కుమార్తె, అల్లుడు ఎలా స్పందిసతారు.. దీనిపై ఎలాంటి పరిణాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
ఐతే ఈ కేసుపై గతంలోనూ తులసమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఆ పిటిషన్లో కీలక అంశాలను ఆమె పేర్కొన్నారు. వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలున్నాయన్నారు. వివేకా హత్య తరువాత ఆయన కుటుంబ సభ్యుల తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు/చిన బావమరిది రాజ శేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతో పాటు కొమ్మా పరమేశ్వర రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైజీ రాజేశ్వర రెడ్డి, నీరుగట్టు ప్రాసాద్ ల పాత్ర ఉందని.., వారినీ సీబీఐ విచారించాలని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ.. వివేకా పీఏ ఇనాయతుల్లాను ప్రశ్నిస్తున్నారు. గతంలో పలుసార్లు ఇనాయతుల్లాను ప్రశ్నించిన సీబీఐ.. వివేకా హత్య తర్వాత బెడ్ రూమ్, బాత్ రూమ్, మృతదేహం ఉన్న పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అప్పట్లో వివేకా ఇంటిని, ఇంట్లోని దృశ్యాలను ఇనాయతుల్లానే ఫోటోలు తీశాడు. దీంతో కేసులో అతడే కీలకంగా మారాడు.
ఇదిలా ఉంటే ఈకేసులో అప్రూవర్ గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందంటూ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనను హత్య చేసేందుకు పులివెందులకు చెందిన వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. ముఖ్యంగా గోపాల్ అనే వ్యక్తి తనతో గొడవ పడుతూ బెదిరిస్తున్నాడని.. పోలీస్ స్టేషన్లోనూ అలాగే ప్రవర్తించాడని చెప్పాడు. తాను ఆవేశంలో కొట్టడంతో తనపై కేసు నమోదు చేశారని చెప్పాడు. తనకు ఏం జరిగినా వైసీపీ నాయకులే బాధ్యత వహించాలని దస్తగిరి అన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.