నెల్లూరు రూరల్ (Nellore Rural) వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Koramreddy Sridhar Reddy) గుండెపోటుకు గురయ్యారు. 47 రోజులుగా తన నియోజకవర్గంలో జగన్నన మాట.. కోటం రెడ్డి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించిన కోటం రెడ్డి.. శుక్రవారం కూడా నియోకజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిన జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై వైసీపీ ముఖ్యనేతలు కూడా ఆరా తీశారు.
ఇదిలా ఉంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. దాదాపు నెలన్నరగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవడంతో పాటు రాత్రుళ్లు కూడా ప్రజల నివాసాల్లోనే నిద్రిస్తున్నారు. పూరి గుడిసెల్లో కి వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, ప్రజలతో కలిసి ఇళ్లలోనే భోజనం చేస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆయా గ్రామాల్లో చోటు చేసుకుంటున్న సమస్యలకు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం తొమ్మిది నెలల పాటు ఏకధాటిగా ప్రతి గడప తొక్కుతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ మండలం అమంచర్లలో పర్యటించిన కోటం రెడ్డి ఓ ఇంట్లో భోజనం చేశారు. మహిళ పెట్టిన భోజనాన్ని ఆగరించిన ఆయన.. బాగుందమ్మా అంటూ మెచ్చుకున్నారు.
ఐతే కోటం రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు స్పష్టతనిచ్చారు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పుడు పల్స్ రేట్ దాదాపు 180గా ఉందని.. 10 నిముషాల్లోనే ట్రిట్ మెంట్ ఇవ్వడంతో హార్ట్ బీట్ దిగొచ్చిందన్నారు. ప్రస్తుతానికి కోటం రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించినట్లు వివరించారు.
ఇదిలా ఉంటే నెల్లూరు అపోలో నుంచి చెన్నైకి తరలిస్తుండగా.. ఆస్పత్రి స్ట్రెచర్ పై ఉన్న కోటం రెడ్డి.. ఆయన భార్య మెడలో తాళిబొట్టు పట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాాతావరణం నెలకొంది. డాక్టర్లు ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కోటంరెడ్డికి అస్వస్థతగా ఉందన్న విషయం తెలుసుకున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Minister Kakani Gowardhan Reddy) ఆస్పత్రికి వెళ్లి కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన్ను పరామర్శించి జాగ్రత్తలు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.