MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డికి మరోసారి రాజ్యసభ యోగం లేదా..? ఆయనకు రెన్యువల్ చేయాలని అధినేత అనుకోవడం లేదా..? మరోవైపు మెగా ప్రొడ్యూసర్ కు ఆ ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
MP Vijayasai Reddy: అధికార వైసీపీ (YCP)లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా..? మొన్నటి వరకు వైసీపీలో నెంబర్ టూగా ఉన్న ఆయనను.. అధినేత దూరం పెడుతున్నారా..? ఇటు గల్లీలో రాజకీయాలు చేయాలన్నా.. ఢిల్లీలో వ్యవహారాలు చూడాలన్నా అధినేత చూపు ఆయనవైపే ఉండేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. ప్రభుత్వం.. పార్టీ పరంగా అన్ని వ్యవహరాల్లోనూ సజల జోక్యం మాత్రమే కనిపిస్తోంది. ఇతర నేతల సలహాలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మరో వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 2024 ఎన్నికల లక్ష్యంగా అనూహ్య నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సీఎం జగన్ (CM Jagan) కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత వారిని తప్పించి కొత్త వారికి కేబినెట్ లో అవకాశం అని తొలుత చెప్పినా.. చివరకు కేబినెట్ లో పాత - కొత్త మంత్రుల ఫార్ములా అమలు చేసారు. దాంతో పాటు కొత్త వారిలో అవకాశాలు..సామాజిక సమీకరణాలు ఆసక్తి కర చర్చకు కారణమయ్యాయి. అదే విధంగా పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఊహించిన విధంగానే ఎంపిక చేశారు. కానీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం లో మాత్రం ట్విస్టులు తప్పేట్టు లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy)కి షాక్ తప్పదు అంటున్నారు.
ఇకపై కేవలం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా అనుబంధ విభాగాలను సమన్వయానికి మాత్రమే ఆయన్ను పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ బాధ్యతలను ఆయనకు అప్పచెప్పారు కూడా. ఇప్పుడు ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. మరి ఆ పదవి రెన్యువల్ చేస్తారని.. కచ్చితంగా మరో ఛాన్స్ ఉంటుందని చెబుతన్నారు. మొన్నటి వరకు ఇదే ప్రచారం ఉంది. కానీ కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్లు గట్టిగానే చెబుతూ వచ్చారు. కానీ, కొన్ని కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి సాయిరెడ్డికి రెన్యువల్ తప్పనిసరి అంటున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి మైనార్టీ.. మరకొటి ప్రముఖ పారిశ్రామిక వేత్త సతీమణి.. మరొకటి బీసీ లేదా ఎస్సీ కి కేటాయిస్తారనే ప్రచారం పార్టీలో ఉంది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్తగా కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది.
అందులో భాగంగా న్యాయవాదిగా.. నిర్మాతగా వ్యవహరిస్తున్న నిరంజన్ రెడ్డి పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉందని పార్టీలో కొందరు చర్చిస్తున్నారు. చిరంజీవి- రాం చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీకి ఆయన నిర్మాతగా ఉన్నారు. సీఎం జగన్ తో పాటుగా చిరంజీవితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆలీ వైపు సీఎం మొగ్గు చూపినట్లు ప్రచారం సాగింది. అయితే, ఆలీకి వారం పది రోజుల్లో గుడ్ న్యూస్ అని చెప్పినా... ఇప్పటి వరకు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో..ఇప్పుడు సాయిరెడ్డికి రెన్యువల్ చేయకుండా నిరంజన్ రెడ్డికి కేటాయిస్తారా లేక.. నాలుగు సీట్లలో రెండు రెడ్డి వర్గానికి కేటాయించి.. సాయిరెడ్డిని కొనసాగిస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
రెండో స్థానం బీసీ వర్గం నుంచి బీదా మస్తాన రావు పేరు రేసులో ఉంది. బీదా మస్తానరావు సైతం నెల్లూరు జిల్లా వాసే. సాయిరెడ్డి సొంత జిల్లా సైతం నెల్లూరు. అయితే, మూడో స్థానం మాత్రం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ కుటుంబ సభ్యులకు ఖాయమని చెబుతున్నారు. నాలుగో స్థానం పైనా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు సజ్జల..వైవీ సుబ్బారెడ్డి సైతం రాజ్యసభ సీటు కోసం రేసులో ఉన్నారనే ప్రచారం ఉంది. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వారికి పార్టీ బాధ్యతలు మాత్రమే అప్పగిస్తారనే మరో ప్రచారం ఉంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.