ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) భీమవరం (Bheemavaram) పర్యటన సందర్భంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Ragurama Krishnam Raju) కార్యక్రమానికి హాజరయవడంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సాపురం ఎక్స్ ప్రెస్ (Narsapur Express) లో హైదరాబాద్(Hyderaad) నుంచి భీమవరం బయలుదేరిన ఆయన అర్ధాంతరంగా మధ్యలోనే వెనుదిరిగారు. లింగపల్లిలో ట్రైన్ ఎక్కిన రఘురామకృష్ణంరాజు.. బేగంపేట్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఏపీ పోలీసులు అనుసరిస్తుండటంతోనే ఎంపీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రఘురామకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేపట్టిన యువకులతో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెనుదిరుగుతున్నట్లు రఘరామ చెప్పారు.
భీమవరంలో మోదీ పర్యటన ఖరారైనప్పటి నుంచి స్థానిక ఎంపీ రఘురామ కృష్ణం రాజు వస్తారా రారా అనే అంశం తీవ్రచర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ హైకోర్టుకు కూడా వెళ్లారు. తనను అడ్డుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేయగా.. చట్టప్రకారం వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.
మరోవైపు రఘురామ కృష్ణం రాజు భీమవరానికి రాకముందే ఏపీ పోలీసులు షాకిచ్చారు. ఆయన్ను వేదికపైకి అనుమతించే అంశంపై క్లారిటీ ఇచ్చారు. పీఎంఓ నుంచి వచ్చిన జాబితాలో హెలిపాడ్ వద్దకు అనమతించే జాబితాలోగానీ, వీఐపీ గ్యాలరీ జాబితాలో గానీ.. రఘురామ కృష్ణం రాజు పేరు లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. అంతేకాదు ఎంపీ వస్తున్నట్లు సమాచారం కూడా లేదన్నారు. దీంతో ఆయన వాహనానికి ఎంట్రీపాస్ కూడా జారీ చేయలేదు. ఈ వ్యవహారంపై రఘురామ కృష్ణం రాజు ఉన్నతాధికారులను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల రఘురామకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. తనపై సీఐడీ విచారణకు అనుమతి, సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే రాజద్రోహం నేరానికి సంబంధించి కేసులపై పిటిషనర్ రఘురామ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రఘురామ వాదనతో ఏకీభవించని హైకోర్టు రాజద్రోహం (ఐపీసీ 124ఎ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్‌పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురి చేయకుండా నిలువరించాలని రఘురామ ఈ పిటిషన్ లో కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.