హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: హైదరాబాద్ కు ఎంపీ రఘురామ.. ట్విస్టులపై ట్విస్టులు.. సీఎస్ కు ఎంపీ భార్య ఫోన్..

RRR: హైదరాబాద్ కు ఎంపీ రఘురామ.. ట్విస్టులపై ట్విస్టులు.. సీఎస్ కు ఎంపీ భార్య ఫోన్..

రఘురామకృష్ణం రాజు

రఘురామకృష్ణం రాజు

ఏపీలో పెను సంచలనంగా మారిన ఎంపీ రఘరామ రాజు కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. చివరికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా తరలింపు ఆలస్యమైంది. రఘురామ రాజు భార్య రమ.. ఏపీ సీఎస్ కు ఫోన్ చేయడంతో.. ఎంపీని గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు తరలించారు. రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. రఘురామ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపనుంది. రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలివ్వడం పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇప్పటికే రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది అయితే అంతకముందు నాటకీయ పరిణామాలు చేటు చేసుకున్నాయి.

  రఘురామకృష్ణరాజు వ్యవహరంలో పలు ఆసక్తికరమైన మలుపులు, ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు భార్య రమాదేవి ఫోన్ చేశారు. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఎస్.. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పారు. అప్పటి వరకు జాప్యం చేసే ధోరణిలో కనిపించిన ప్రభుత్వ వర్గాలు రఘురామను హైదరాబాద్ తరలించారు.

  అంతకుముందు రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటిషన్, ఆయనపై కస్టడీలో జరిగిన హింసకు సంబంధించి రెండు వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణరావు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ గువాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 20వ తేదీకి వాయిదా వేసింది. పోలీస్ కస్టడీలో జరిగిన థర్డ్ డిగ్రీ వ్యవహరంపై సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. తన క్లయింట్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఏపీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించటం అన్యాయమని, దర్యాప్తు అధికారి ఒకరే అయితే న్యాయం ఎలా జరుగుతుందని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజు నడవలేకపోతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

  రఘురామకృష్ణరాజును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రికి తరలించాలని కోరారు. ఎయిమ్స్‌కు తరలించేందుకు తమకు అభ్యంతరంలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలుపగా, మంగళగిరి ఎయిమ్స్‌లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సలహాదారులుగా ఉన్నారని, అక్కడ వైద్య పరీక్షలు సాధ్యంకాదని ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రఘురామ కృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన తరపు న్యాయవాదులతోపాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు అంగీకరించారు. దీంతో రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని, ముగ్గురు వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆసుపత్రిలోనే ఆయనకు ట్రీట్ మెంట్ అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతో ఆయన్ను ప్రస్తుతం హైదరాబాద్ కు తరలించారు.. రాత్రి ఆయన ఆస్పత్రికి చేరుకుంటారు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju, RRR, Supreme Court

  ఉత్తమ కథలు