NTR Barath Ratna: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పుట్టి 40 ఏళ్లు అయ్యింది. నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు అంబరాన్ని అంటుతూనే ఉన్నాయి. 40 వసంతాల వేడుకలను టీడీపీ (TDP) శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ నేత, లోక్ సభ ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jaydev).. పార్లమెంటులో టీడీపీ పేరుతో పాటు ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. ఆత్మగౌరవమే నినాదంగా, వెనుకబడిన వర్గాలకు అండగా, ప్రగతిశీల రాజకీయాలకు దర్పణంగా నిలవాలనే ఉద్దేశంతో స్థాపించిన పార్టీ తెలుగు దేశం అని జయదేవ్ గుర్తు చేశారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సత్తా చాటిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని చాలాకాలం నుంచి టీడీపీ డిమాండ్ ఉందని.. అదే డిమాండ్‌ను మరోమారు లోక్ సభలో ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన గల్లా జయదేవ్.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ 40 వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని ఆయన పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్థాపకులు, అన్నగారు ఎన్టీ రామారావుగారికి నివాళులు అర్పించామని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ కేంద్రం దగ్గర ఈ డిమాండ్ వినిపించారు. తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవాన్ని సంపాదించిపెట్టిన, ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సత్తాచాటిన ఎన్టీఆర్ కు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని.. ఇప్పటికే ఆలస్యమైంది అన్నారు.
ఈ రోజు తెలుగు దేశం 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, పార్లమెంట్లో మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామా రావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. @JaiTDP #40GloriousYearsOfTeluguDesam pic.twitter.com/6haFz6lrg2
— Jay Galla (@JayGalla) March 29, 2022
కేజీ 2 రూపాయలకే బియ్యం అందించి ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చారని, మద్యపాన నిషేధం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. భారతరత్నకు ఎన్టీఆర్ అన్ని విధాలా అర్హుడని గల్లా జయదేవ్ వెల్లడించారు. ఇటు మరో ఎంపీ రామ్మోహన్ రాయుడు సైతం.. ఆవిర్భావ దినోత్సవ సభలో ఎన్టీఆర్ ఘనతలను గుర్తు చేశారు. శ్రామికుడి కష్టం నుంచి, కార్మికుడు శ్రమకోర్చి కరిగించిన కండరాల శక్తి నుంచి, రైతుల స్వేదం నుంచి, నిరుపేదల ఆశల నుంచి, కష్టజీవుల ఆకాంక్షల నుంచి, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి పౌరుషం చాటి చెప్పటం కోసం పుట్టింది ఈ తెలుగుదేశం అని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"శ్రామికుడి కష్టం లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతుల రక్తంలో నుంచి, నిరుపేదల కష్టంలో నుంచి, కష్టజీవుల కంటి మంట లో నుంచి, తెలుగోడి ఆత్మ గౌరవం కోసం తెలుగోడి పౌరుషం చాటి చెప్పటం కోసం పుట్టింది ఈ తెలుగుదేశం!" #40GloriousYearsOfTeluguDesam pic.twitter.com/2km3UVWLIJ
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) March 29, 2022
తెలుగు జాతి ఉన్నంతవరకు, పసుపు జెండా బలంగానే ఉంటుందన్నారు. తెలుగు ప్రజలకు, టీడీపీ నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొంటూ.. చివర్లో జై తెలుగుదేశం అని నినదిస్తూ తన సంక్షిప్త సందేశాన్ని ముగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.