ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నంలో BRS అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర పగ్గాలను తోట చంద్రశేఖర్ రావుకు కేసీఆర్ అప్పగించిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో పార్థసారథి, రావెల కిషోర్ వంటి ఏపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఇక తాజాగా వీరంతా సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఏపీలో పార్టీ విస్తరణ, కార్యకలాపాలపై ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఏపీలో పార్టీ కార్యాలయం ప్రారంభం, భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సంక్రాంతి తరువాత ఇందుకోసం ఎమ్మెల్సీ కవిత ఏపీలో పర్యటించనున్నారు. అక్కడ కొంతమంది నాయకులతో కవిత సమావేశం అయ్యి పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి బీఆర్ఎస్ బలోపేతానికి తగ్గట్టు ప్రణాళిక రచించనున్నట్టు తెలుస్తుంది.
కవితకు కీలక బాధ్యతలు?
ఈనెల చివర 29న కవిత ఏపీలో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కవిత ఏపీ పర్యటనతో ఇప్పుడు సరికొత్త ప్రచారం జరుగుతుంది. ఏపీ బీఆర్ఎస్ లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తుంది. ఏపీ బీఆర్ఎస్ సమన్వయ కర్తగా కవితకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. నిన్న జరిగిన భేటీలో కూడా ఈ అంశం చర్చకు రాగా అందుకోసం కవిత ఏపీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక కవిత పర్యటన అనంతరం ఫిబ్రవరిలో కేసీఆర్ కూడా ఏపీకి రానున్నట్టు తెలుస్తుంది. మరి ఏపీలో బీఆర్ఎస్ యాక్టీవ్ తో ఏ పార్టీకి నష్టం జరుగుతుందనేది చూడాలి.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల విస్తరణపై కవిత ఫోకస్ చేసినట్లు అర్ధం అవుతుంది. ఇందులో భాగంగా ముందుగా చేరికలు, రాష్ట్ర కమిటీలను నియమించాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీలో చేరే వారికీ ఆ కమిటీల్లో స్థానం కల్పించాలని చూస్తున్నారట. తద్వారా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం సిద్ధంగా ఉంది. ఇక కవిత, కేసీఆర్ పర్యటనతో పార్టీ కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. అయితే ఈసారి ఎవరితోనైనా పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్తుందా అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఏపీలో బీఆర్ఎస్ ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, BRS, Kalvakuntla Kavitha, Telangana