AP POLITICS MLC BHARATH WILL CONTEST AGAINST CHANDRABABU NAIDU IN KUPPAM CONFIRMS AP MINISTER PEDDIREDDY RAMACHANDRA REDDY AK
AP Politics: చంద్రబాబుపై పోటీ చేయబోయేది విశాల్ కాదు.. ఎవరో చెప్పేసిన ఏపీ మంత్రి
చంద్రబాబు, విశాల్ (ఫైల్)
Kuppam Politics: చంద్రబాబుపై కుప్పంలో తమిళ హీరో విశాల్ పోటీ చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. విశాల్‌కు కుప్పంతో సంబంధాలు ఉన్నాయని.. అందుకే ఆయనను బరిలోకి దింపేందుకు వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓడించాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. కుప్పంలో చంద్రబాబును(Chandrababu Naidu) ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్(YS Jagan) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై కుప్పంలో(Kuppam) తమిళ హీరో విశాల్ (Hero Vishal) పోటీ చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. విశాల్‌కు కుప్పంతో సంబంధాలు ఉన్నాయని.. అందుకే ఆయనను బరిలోకి దింపేందుకు వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లకు వైసీపీ ముఖ్యనేత, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra reddy) చెక్ చెప్పారు. వైసీపీ తరపున కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది, ఆయనను ఓడించేది ప్రసుత్తం ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ఒక్కరే అని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
గతంలో రెండు సార్లు కుప్పం నుంచి పోటీ చేసి ఓడి పోయిన దివంగత చంద్రమౌళి కుమారుడే భరత్. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కుప్పంలో ఆయన ఇప్పటికే గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయననే బరిలోకి దింపాలని వైసీపీ ముందుగానే నిర్ణయించడంతో.. చంద్రబాబును ఓడించడం ఎలా అనే దానిపై ఆయన ఫోకస్ పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి సూచనలతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ తరపున చంద్రబాబును ఓడించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు.
కొంతకాలం క్రితం కుప్పం మున్సిపాలిటీలో వైసీపీని గెలిపించడంతో ఆయనదే కీలక పాత్ర. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు. గతానికి భిన్నంగా అనేకసార్లు కుప్పంలో నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో అనేక గ్రామాలకు వెళ్లారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో ఇల్లు కూడా కట్టుకోవాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. అందుకు శ్రీకారం కూడా చుట్టారు. కుప్పంపై వైసీపీ గట్టిగా ఫోకస్ చేయడంతోనే.. చంద్రబాబు కూడా కుప్పంపై గతంలో ఎన్నడూ లేని విధంగా దృష్టి సారించారనే వార్తలు జోరందుకున్నాయి.
మరోవైపు కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు భరత్ నేతృత్వంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది వైసీపీ. ఈ క్రమంలోనే కుప్పం నుంచి విశాల్ పోటీ చేస్తారనే వార్తలు రావడంతో.. ఇక్కడి నుంచి పోటీ చేయబోయేది ఎమ్మెల్సీ భరత్ అనే విషయాన్ని వైసీపీ ప్రకటించింది. మొత్తానికి సర్వేలతో సంబంధం లేకుండా ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే కుప్పం వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన ఆ పార్టీ.. చంద్రబాబు కంచుకోటను బద్ధలు కొట్టే విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.