P Anand Mohan, News18, Visakhapatnam
పెనం మీదనుంచీ పొయ్యి మీద పడ్డట్టు ఉందట.. వైసీపీ (YSRCP)లోకి వచ్చిన వలస ఎమ్మెల్యేలకి. ఇప్పటికైతే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) విషయంలో సొంతపార్టీ నేతలు బయటపడ్డారు. పలుసార్లు ఆయన కూడా బహిరంగంగా కాకపోయినా పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టారు. ఇదే బాటలోనే వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తమ అక్కసు వెళ్లగక్కే రోజులు అట్టే దూరంలో లేవట. వంశీ బాటలోనే మరో ఎమ్మెల్యే కూడా కూడా తన నిరసన గళాన్ని విప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. రేపో మాపో ఆయన తన రూట్ లో సెపరేట్ యవ్వారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారని కూడా తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గ పంచాయితీ తర్వాత విశాఖ దక్షిణ నియోజవర్గం పంచాయితీ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా తన నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.
ఏపీలో వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీ, జనసేన నుంచి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీవైపు వచ్చారు. జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారని టాక్ ఉండనే ఉంది. అయితే సీఎం జగన్ కి కొత్తగా వచ్చినవారితో తలనొప్పులు మొదలయ్యాయి. గన్నవరంలో టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీని స్థానిక గ్రూపులు దగ్గరకు రానీయడంలేదు. దీంతో వారితో వంశీకి గొడవలు మొదలయ్యాయి. చివరకు అవి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు చేరాయి.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి, అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నాయి. గతంలో ఓసారి సీఎం జగన్ వీరిద్దరినీ కలిపారు. ఇకపై సఖ్యతగా ఉండాలని చెప్పారు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు. ఇటీవల కొంతకాలంగా వారి మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు పెచ్చుమీరాయి. ఈ విషయం మరోసారి సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో ఈ వ్యవహారం త్వరగా తేల్చాలని పార్టీ సీనియర్లకు చెప్పారు జగన్.
దీంతో పాటు.. ఇటు విశాఖలోనూ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేకి వైసీపీ పూర్వ నేతలతో అస్సలు పొసగట్లేదు. ఇది కాక కొత్తగా వచ్చిన వారితో కొత్త తంటాలు మొదలయ్యాయి. గతంలో వైసీపీ నుంచీ దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. అదే నియోజకవర్గంలో టీడీపీ నుంచీ దక్షిణ ఎమ్మెల్యేగా వాసుపల్లి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఆయన పార్టీలో చేరిపోయారు. ఆయన కుమారుడితో సహా వైసీపీలోకి దిగిపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్‌తో గణేష్‌కు విభేదాలు మొదలై అవి తీవ్రమయ్యాయి. ఓ ఎంపీని అడ్డుపెట్టుకుని సీతంరాజు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారంటూ గణేష్ ఓపెన్ కామెంట్స్ చేస్తూ తన అసంతృప్తిని మీడియా ముందే బయటపెట్టారు. ఇలా ఎమ్మెల్యే తన అక్కసు వెళ్లగక్కారు. కాగా మళ్లీ తిరిగి టీడీపీలోకి వస్తారని ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది.
మరోపక్క ఇటీవల నెల్లూరు జిల్లాలో కాకాణి, అనిల్ మధ్య కూడా ఇలాంటి తగువే ఉంది. అలాగే సయోధ్య చర్చలు పెట్టారు. ఇప్పుడు మరోసారి గన్నవరం విషయంలో కూడా అలాంటి చర్చలకు సిద్ధమయ్యారు. వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుని తాడేపల్లికి పిలిపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు.. నాయకులిద్దరితో సమావేశమయ్యారు. గన్నవరంలో ఏం జరుగుతుందో ఆరా తీశారు. ఇద్దర్నీ పిలిచిన పార్టీ పెద్దలు పంచాతీని తెంచలేకపోయారు. మరి ఈ పంచాయితీ తర్వాత వైసీపీకి వాసుపల్లి పంచాయితీ ఉంటుందని అంచనా. టీడీపీ నుంచీ కొత్తగా వచ్చిన వారితో సఖ్యత ఉండాలని చెప్పడం ఈ ఎమ్మెల్యేలకి నచ్చడం లేదు. రామచంద్రరావు, సుధాకర్ విషయంలో వంశీ, గణేష్ ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. మరి మిగతా వారు క్యూ కడుతున్నారని.. వారి టోకెన్ నెంబర్ ఏమిటో తెలియడం లేదంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp