Minister Bosta: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు అనే ఫీలింగ్ తోనే కనిపిస్తున్నాయి. అధికార పార్టీ సైతం అందరి కంటే దూకుడుగా ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై మంత్రి బొత్స సత్య నారాయణ (Minster Botsa Satyanarayana) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మహానాడు (Mahanadu) వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విలవిల అంటే అయిపోతుందా.. ప్రజలకు తెలుసు కళ ఉన్న పార్టీ ఏదో అంటూ బొత్స అన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత.. ఈ మూడేళ్లు పక్క రాష్ట్రంలోని ఇంట్లో పడుకున్న చంద్రబాబు.. ఎన్నికల పేరుతో ఇప్పుడు అధికార పార్టీపై యుద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నారని.. ఇఫ్పుడు బాబుకు ఏపీ గుర్తొచ్చిందా అంటూ బొత్స ప్రశ్నించారు. ఒంగోలులో జరిగిన మహనాడు మహా అద్భుతం అంటున్నారని.. కానీ అక్కడకు వారంతా టీడీపీ కార్యకర్తలేనని, ప్రజలెవరూ రాలేదంటూ బొత్స వ్యాఖ్యానించారు. ధరలు పెరిగాయని చంద్రబాబు అంటున్నారని, మరి ఇంతలా పెరగడానికి కారణం ఎవరో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ధరల విషయంలో కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదా అని బొత్స నిలదీశారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. ప్రభుత్వం ముందస్తుకు వెళ్తోందని చెప్పడానికి చంద్రబాబు ఎవరు అంటూ బొత్స నిలదీశారు. తమకు ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదని, చంద్రబాబుకే ఆ అవసరముందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందని బొత్స జోస్యం చెప్పారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేంద్రం నుండి వచ్చిన నిధులు ఎన్ని? మా మూడేళ్ల పాలనలో నిధులు ఎంత వచ్చాయి అనే విషయాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల్లో సఫలీకృతం అవుతున్నామని బొత్స తెలిపారు.
ఇదీ చదవండి : 13 ఏళ్ల బాలికకు విమ్స్ లో అరుదైన చికిత్స.. గత యాభై ఏళ్లలో 68వ చికిత్స ఇదే
సీఎం జగన్ ను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. ఆయన బలగం వై.ఎస్. జగన్ ను ఎదుర్కోవటానికి సరిపోదన్నారు. ఆ విషయాన్ని చంద్రబాబే ఒప్పుకున్నారని బొత్స గుర్తు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ను ఓడించాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, కానీ ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని, మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు విశేషమైన ప్రజాధరణ లభిస్తుందన్నారు. చంద్రబాబు ఎవరితో కలిసి వస్తారో.. ఎంతమందితో కలిసి వస్తారో రానీయండి అన్నారు. తాము మాత్రం సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తామంటూ బొత్స అన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని, ఈసారి టీడీపీ కనుమరుగు కావటం ఖాయమని, ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు బొత్స.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, TDP, Ycp