AP POLITICS MINSTER BOTSA SATYANARAYANA NOT HAPPY WITH HIS DEPARTMENT TILL HE NOT TAKE CHARGE NGS VZM
AP Minster: మంత్రి పదవి దక్కినా ఆ సీనియర్ హ్యాపీగా లేరా..? కేటాయించిన శాఖ ఎందుకు నచ్చలేదు? ఆ మంత్రికి ఏం కావాలి..?
ఆ మంత్రికే అధిక ప్రాధాన్యం
AP Minster: ఆ సీనియర్ మంత్రి పదవి పోవడం పక్కా అన్నారు.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా చేస్తారనే ప్రచారం జరిగింది. మంత్రులంతా మూకుమ్మడి రాజీనామాలు చేసిన తరువాత.. ఆ మంత్రి ఛాంబర్ లో మరో ముగ్గురు మంత్రులు కలిసి చర్చలు జరిపారు. అయితే అనూహ్యంగా అందుల్లో ముగ్గురుకి తిరిగి మంత్రి పదవులు దక్కాయి. అయినా ఆయన హ్యాపీగా లేరా..? సీఎం కేటాయించిన శాఖ ఆయనకు ఎందుకు నచ్చడం లేదు.
AP Minster: ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఒకనొక సమయంలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.. ఆయనే ఉత్తరాంధ్ర కీలక నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana). మళ్లీ మరోసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. సీఎం జగన్ (CM Jagan) తొలి కేబినెట్ లో సైతం కీలకమైన మంత్రి బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయనకు సెకెండ్ ఛాన్స్ ఉండదంటూ ప్రచారం జరిగింది. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేయొచ్చు.. లేద రీజనల్ ఇంచార్జ్ పోస్ట్ అయినా ఇస్తారంటూ ప్రచారం జరిగింది. మంత్రులందరి మూకుమ్మడి రాజీనామా తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. రాజీనామాలు సమర్పించిన తరువాత నలుగురు మంత్రులు.. బొత్స ఛాంబర్ లో సమావేశం అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది బయటకు తెలియలేదు.. కానీ ఆ సమావేశం తరువాత పరిణామాలు మారాయనే ప్రచారం ఉంది. మొదట ముగ్గురు, నలుగుర్ని మాత్రమే తిరిగి కొనసాగిస్తామన్న సీఎం జగన్.. 11 మందికి తిరిగి కేబినెట్ అవకాశం కల్పించారు. అందులో బొత్స కూడా ఉన్నారు. అంతే కాదు ఆయనకు విద్యాశాఖ ను కేటాయించారు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా రచ్చ అవుతోంది. తనకు బెర్త్ దక్కినా ముభావంగానే ఉన్నారు. ఇప్పటివరకు.. తనకు కేటాయించిన శాఖ బాధ్యతలే తీసుకోలేదు.
రెండు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయాలు చేస్తున్న బొత్స.. ప్రస్తుత కేబినెట్ విస్తరణ తర్వాత.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో హుందాగా వ్యవహరించిన ఆయన.. శాఖ కేటాయింపు తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఏమిటా అని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. తనకు కేటాయించిన విద్యాశాఖపై.. బొత్స తెగ ఫీలైపోతున్నారట.. మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత కల్పించలేదనే వాదన ఆయన వర్గం నుంచి వినిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణ తర్వాత.. మంత్రులంతా సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కానీ.. ఈ కార్యక్రమానికి బొత్స హాజరవ్వలేదు. అమరావతిలో విద్యాశాఖపై సీఎం రివ్యూ చేశారు. పదో తరగతి పరీక్షలతో పాటు వరుసగా వస్తున్న ఇతర పబ్లిక్ ఎగ్జామ్స్ పైనా చర్చించారు. కానీ.. ఈ రివ్యూకు కూడా శాఖ మంత్రిగా బొత్స హాజరుకాలేదు. ఈ పరిణామాలన్నింటికి.. బొత్సలో ఉన్న అసంతృప్తే కారణమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
కానీ మంత్రి అనుచరుల వెర్షన్ వేరేలా ఉంది. తన సోదరుడు లక్ష్మణరావు కుమార్తె వివాహ వేడుకల ఏర్పాట్లలో ఉండటం వల్లే.. సీఎంను కలవలేకపోయారని, విద్యాశాఖపై రివ్యూకు హాజరవలేకపోయారని. ఈ విషయం సీఎంకు కూడా చెప్పారంటున్నారు. మరోవైపు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారి సొంత జిల్లాకు వస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కనీసం.. అధికారిక సమాచారం కూడా లేదు. కట్ చేస్తే.. ఇదే నెలలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కనిపించారు. జిల్లాకు వస్తున్నట్లు సమాచారం గానీ.. స్వాగత ఏర్పాట్లు గానీ.. ఎక్కడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు తనకి కేటాయించిన విద్యా శాఖకు సంబంధించి బాధ్యతలు తీసుకోకపోవడంపైనా చర్చ నడుస్తోంది. తనకి ఇష్టమైన శాఖ కేటాయించకపోవడం వల్లే.. సత్తిబాబు అలిగారన్న టాక్ వినిపిస్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.