తెలంగాణలో ప్రత్యక్షమయ్యారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలిసారిగా హైదరాబాద్లోని ప్రగతి భవన్కు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు. మంత్రి హోదాలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా సీఎంతో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాకు కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. రోజా కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని కూడా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత.. రోజాకు బొట్టు పెట్టారు. కేసీఆర్ సతీమణి కూడా రోజాకు కుంకుమ బొట్టు పెట్టారు. అయితే రోజా, కేసీఆర్ భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజీకయంగా వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మర్యాదపూర్వక భేటీ అని ప్రచారం జరుగుతున్నా.. పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
తనకు టైం ఇవ్వాలని గురువారమే మంత్రి రోజా కోరినట్లు..దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు ప్రగతి భవన్ వర్గాలు సమయం కేటాయించారని తెలుస్తోంది. దీంతో నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలిశారు. సినిమా అంశాలే కాకుండా.. రాజకీయాలపై చర్చించారని సమాచారం. అయితే సీఎం కేసీఆర్, రోజా మధ్య దోస్తీ బాగానే ఉంది. వీరిద్దరు గతంలో కూడా చాలా సార్లు భేటీ అయ్యారు. గతంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజాకు ఫోన్ లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. కాంచీపురం పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్.. నగరి వద్ద ఆగి… రోజా ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేశారు. అంతేగాకుండా హైదరాబాద్ లో జరిగే పలు కార్యక్రమాల్లో రోజా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత.. సినీ నటుడు చిరంజీవిని కూడా మంత్రి రోజా కలిశారు.
ఈరోజు ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. నన్ను సొంత కూతురిలా చూసుకునే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్నాను. @RaoKavithapic.twitter.com/iOvvn7VV8D
సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత రోజా.. అనంతరం మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. రోజా ఫ్యామిలీ మొత్తం కలిసి చిరు ఇంట్లో సందడి చేశారు. చిరంజీవి, సురేఖలతో కలిసి రోజా ఫ్యామిలీ సభ్యులందరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. సిని పరిశ్రమ నుండి వెళ్లి ఏపీ రాజకీయల్లో తనదైన ముద్రను వేసి, మంత్రి పదవి చేపట్టిన రోజాను అభినందించి, సత్కరించారు చిరంజీవి. మరోవైపు రోజా పలువురు ప్రముఖుల్ని వరుసగా భేటీ అవ్వడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసీఆర్తో రోజా ఓ వైపు భేటీ అయితే.. మరోవైపు సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ ఏపీలో నెలకొన్న పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఏపీలో రోడ్లు, విద్యుత్ విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ పెద్దలు భగ్గుమంటున్నారు. ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఏపీ మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలవడంపై చర్చలు జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.